ఈరోజుల్లో చదువు అవగానే జాబ్ తెచ్చుకోవడం చాలా కష్టంగా మారింది.. కాంపిటీషన్ ఎక్కవ..కొలువులు తక్కువ..ఉన్న ఊరిలో చదువుకోవడానికి అవ్వదు..ఉద్యోగం చేయడానికీ అవ్వదు. వలస ప్రయాణికుల్లా పొట్టకూటికోసం.. ఎక్కడెక్కడికో వెళ్లి జాబ్‌లు చేస్తున్న వాళ్లు ఎంతో మంది ఉన్నారు. మన్యంలో పుట్టిన చదువుబిడ్డ 27 ఏళ్లకే వార్షిక వేతనం రూ.3.20 కోట్లు ఉద్యోగం సంపాదించాడు. మారుమూల పల్లెటూరి నుంచి వచ్చిన ఈ యువకుడు నేడు ఇంత పెద్ద శాలరీతో జాబ్ తెచ్చుకోవడం వారి ఊరికే కాదు.. ఎంతోమందికి ఆదర్శంగా ఉంది. తెలంగాణ గడ్డపై పుట్టిన ఈ తెలుగు తేజం గురించి పూర్తి వివరాలు..
ఖమ్మం జిల్లా ఇల్లెందు మండలం సుభాష్నగర్ గ్రామానికి చెందిన కొండా నారాయణ, రాజేశ్వరి దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు. నారాయణ ఆర్ఎంపీగా పనిచేస్తూ మెడికల్ దుకాణం నడిపేవారు. కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు పడేవారు. మొదటి కుమార్తె ప్రగతి బీడీఎస్, రెండో కుమార్తె పవిత్ర ఎంఫార్మసీ, మూడో కుమార్తె ప్రశాంతిని సాఫ్ట్వేర్ చదివించి ఎలాగైతే పెళ్లిళ్లు చేశారు. అఖిల్ను చదివించే క్రమంలో ఆర్థిక సమస్యలు మరింత పెరిగాయి. 1 నుంచి 5వ తరగతి వరకు పలు ప్రైవేటు పాఠశాలల్లో చదివించాల్సి వచ్చింది.
అడుగడుగునా అండగా నిలిచిన అదృష్టం..
పాఠశాలలో ఫీజులు చెల్లించలేక ఓ డ్రిల్ మాస్టర్ సింగరేణి పాఠశాలలో చేర్పించేందుకు సహకరించాడు. తానే ఫీజు చెల్లించి నారాయణకు అండగా నిలిచాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ప్రైవేటు విద్యాసంస్థ 7వ తరగతిలో చేరేందుకు ప్రవేశ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షలో అఖిల్ ఉమ్మడి ఏపీలో ఆరో స్థానం సాధించాడు. దీంతో ఆ విద్యాసంస్థ అఖిల్‌కు 7వ తరగతి నుంచి ఇంటర్(ఎంపీసీ) పూర్తయ్యే వరకు ఉచితంగా అన్ని రకాల సౌకర్యాలు కల్పించింది
ఐఐటీ ప్రవేశ పరీక్షలో 1,200 ర్యాంకు రావడంతో ఖరగ్‌పూర్ ఐఐటీ కాలేజీలో సీటు లభించింది. అక్కడ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశాడు. అమెరికా వెళ్లి ఎంఎస్ చదవాలని నిర్ణయించుకున్నాడు. తండ్రి ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉండటంతో తిరిగి ఇల్లెందుకు వచ్చి ఓ ప్రైవేటు సంస్థలో రెండేళ్లు చిన్నపాటి ఉద్యోగం చేశారు.
అప్పుచేసి అబ్రాడ్
తనలో ఉన్న కోరికను నెరవేర్చుకునేందుకు తండ్రి సహకారంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు బ్యాంకులో విద్యా రుణం రూ.80 లక్షలు తీసుకున్నాడు. ఇతరుల వద్ద రూ.20 లక్షలు అప్పు తీసుకున్నారు. అనంతరం న్యూయార్క్ నగరంలోని కొలొంబియా యూనివర్సిటీలో ఎంఎస్‌లో చేరాడు. 2022 మేలో చదువు పూర్తి చేశాడు. వార్షిక వేతనం రూ.3.2 కోట్లు ఇచ్చేందుకు గూగుల్ సంస్థ అఖిల్‌తో ఒప్పందం చేసుకుంది. 2022 జులై 11న అఖిల్ కాలిఫోర్నియాలోని గూగుల్ ప్రధాన సంస్థలో స్టేజ్-2 అధికారిగా చేరాడు.
అలా కష్టపడి చదివి నేడు ఈ స్థాయికి ఎదిగాడు..మనలో సాధించాలనే కృషి పట్టుదల ఉంటే.. పరిస్థితులు ఎంత క్రిటకల్‌గా ఉన్నా పైకి వస్తాం..చాలామంది ఉచిత సలహాలు ఇస్తారు.. ఇంకా ఎన్ని సంవత్సరాలు ప్రయత్నిస్తావ్. వదిలేయొచ్చు కదా అని మీ అంతట మీకు అనిపించినప్పుడే ప్రయత్నం మానుకోండి.. సంకల్ప బలం గట్టిగా ఉన్నంత కాలం ప్రయత్నం. చేస్తూనే ఉండాలి. ఏమంటారు..!