కొందరు పెట్ లవర్స్ వాటి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారని మరోసారి రుజువైంది. ఈ క్రమంలోనే ఓ యువ మహిళా రైతు పక్షుల ఆకలి తీర్చడం కోసం ఏకంగా పొలంలోని పంటను వదిలేసింది.వివరాల్లోకివెళితే.. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్‌కు చెందిన యువ మహిళా రైతు గొల్ల సునీత.. తనకున్న 28 గుంటల భూమిలో 20 గుంటల్లో శనగ పంటను వేశారు.
మిగిలిన 8 గుంటలలో నల్ల కుసుమను వేశారు. పంట చేతికొచ్చే సమయానికి రామచిలుకలు, పిచ్చుకలు, ఇతర పక్షులు వాటికి ఇష్టమైన నల్ల కుసుమలను తినడం గమనించిన సునీత.. వాటిపై ఉన్న ప్రేమతో మొత్తం పంటను వదిలేసింది. ఉదయం,సాయంత్రం పక్షులు నల్ల కుసుమను తింటూ కడుపు నింపుకోసాగాయి. పొలం పరిసరాల్లో చెట్లతో పాటు మూడు బోరు బావులు ఉండటంతో వాటి దప్పికను సైతం తీర్చుకునేవని సునీత వెల్లడించారు.