వైఎస్సార్సీపీ నేతలు, సోషల్ మీడియా వారియర్స్ పెడుతున్న అసభ్యకరమైన పోస్టుల కారణంగా గతంలోనూ, ప్రస్తుతం అధికారంలోకి వచ్చాక సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని తెలుగుదేశం పార్టీ పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. శనివారం అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ..‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేమే ఇబ్బంది పడ్డాం.అధికారంలో ఉన్నప్పుడు కూడా మేమే ఇబ్బంది పడుతున్నాం.
41A సెక్షన్ కింద నోటీసులు ఇచ్చి పోలీసులు చేతులు దులిపేసుకుంటున్నారు.భవిష్యత్లో ఇలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే సోషల్ మీడియా దుర్వినియోగంపై కొత్త చట్టం తేవాలి’ అని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదిలాఉండగా, మహిళలు, కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని అధికార పార్టీ నేతలపై వైఎస్సార్ సీపీ నేతలు పెడుతున్న పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు కేసులు పెడుతున్నారు.