ప్రముఖ బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మృతి సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విదితమే. ముంబైలోని బాంద్రాలో ఉన్న తన ఫ్లాట్‌లో సుశాంత్ సింగ్ గతేడాది జూన్ 14వ తేదీన ఉరి వేసుకుని కనిపించాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. అయితే జనవరి 21న సుశాంత్ సింగ్ రాజ్ పూత్ జయంతి సందర్బంగా సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది.
సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆండ్రూస్ గంజ్ నుంచి ఇందిరా క్యాంప్ వరకు ఉన్న రోడ్ నంబర్ 8కు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ పేరును పెట్టాలని అక్కడి మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసింది. స్థానిక కౌన్సిలర్ అభిషేక్ దత్ 2020 సెప్టెంబర్‌లోనే ఈ విషయమై ఒక ప్రతిపాదన చేశారు. దానిపై తాజాగా కౌన్సిల్ సమావేశంలో చర్చించారు. అనంతరం ఆ రోడ్డుకు సుశాంత్ పేరు పెట్టాలని తీర్మానించారు. దీంతో స్థానికంగా ఉన్న సుశాంత్ అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. కాగా త్వరలోనే ఆ రోడ్డుకు సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ మార్గ్‌గా నామకరణం చేయనున్నారు.
ఆ ప్రాంతంలో నిజానికి బీహార్ వాసులు ఎక్కువ. వారు సుశాంత్ అభిమానులు. దీంతో వారు అక్కడి ఆ రోడ్డుకు సుశాంత్ పేరును పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మున్సిపల్ కౌన్సిల్ వారి అభీష్టం మేరకు ఆ నిర్ణయం తీసుకోవడం విశేషం. కాగా సుశాంత్ జయంతి సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానుల పోస్టులు వెల్లువెత్తాయి. సుశాంత్‌ను మిస్ అవుతున్నామంటూ అతని సోదరి శ్వేతా సింగ్ సహా అనేక మంది ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సందేశాలను పోస్ట్ చేశారు. అతని చిన్ననాటి ఫొటోలను పోస్ట్ చేసి అతని జ్ఞాపకాలను పంచుకున్నారు.