శిక్షణ విమానం రన్‌వే పై పల్టీలు కొట్టింది.. కానీ అందులో పైలట్ మాత్రం సేఫ్ గా బయటపడ్డాడు. ఈ ఘటన కేరళ రాజధాని తిరువనంతపురంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం 11.30 గంటలకు సెస్నా 172ఆర్ ట్రైనింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ రన్‌వే నుంచి టేకాఫ్ అయ్యేందుకు ప్రయత్నించే క్రమంలో రన్‌వే పై పల్టీలు కొట్టింది. అనంతరం రన్‌వేకు సమీపంలోని ఖాళీ ప్రాంతంలో తలకిందులుగా పడింది.
దీనిని గమనించిన ఎయిర్‌పోర్ట్ సిబ్బంది వెంటనే స్పందించారు. విమానం పల్టీ కొట్టిన ప్రాంతానికి వెళ్లారు. ఆ ఫ్లైట్‌కు మంటలు అంటుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అందులోని పైలట్‌ను సేఫ్‌గా బయటకు తీశారు. 34 ఏళ్ల అనూప్ నాయర్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడం చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఈ ఘటన నేపథ్యంలో తిరువనంతపురం ఎయిర్‌పోర్ట్‌లో గంట వరకు విమాన సేవలను నిలిపివేశారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు జరిపి డీజీసీఏకు నివేదిక అందజేస్తామని ఎయిర్ పోర్టు అధికారులు వెల్లడించారు.