హోంమంత్రి వ్యాఖ్యల వెనుక అచ్చన్న ప్యూహం ఇదేనా

-

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గత ప్రభుత్వంలో ఐదేళ్లు మంత్రిగా పనిచేశారు. అప్పటికే మూడుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నా.. మొదటిసారి కేబినెట్‌లో ఆయనకు చోటు దక్కింది. తొలుత క్రీడలు, యువజన సంక్షేమం, కార్మికశాఖ వంటి శాఖలు అచ్చెన్నకు అప్పగించారు. టీడీపీ అధికారంలోకి వస్తే హోంశాఖ తనదే అని అచ్చెన్న క్లెయిమ్‌ చేసుకోవడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. ఇంతకీ ఈ ప్రకటన పోలీసులను బెదిరించడానికా లేక హోంశాఖ పై ముందే ఖర్చీఫ్ వేశారా అన్న చర్చ టీడీపీ వర్గాల్లో నడుస్తుందట…

ఇప్పటికి ఐదుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు అచ్చెన్నాయుడు. ఒక్కసారి మాత్రమే ఆయన ఓడిపోయారు. 2014 తర్వాత టీడీపీలో సీనియర్‌ నాయకుడిగానూ ఎదిగారాయన. అప్పటి ప్రతిపక్షంపై మాటల దాడి.. అసెంబ్లీలో, బయటా టీడీపీ స్వరం వినిపించడంలో గట్టిగా వ్యవహరించారు. కానీ.. మనసులో హోంశాఖపై ఆ కోరిక అలాగే ఉండిపోయింది. మంత్రివర్గంలో మార్పులు చేసినా.. హోంశాఖ దక్కలేదు. ఇంతలో మంత్రిగా ఐదేళ్ల కాలం ముగిసిపోయింది. ఇప్పుడు విపక్షపార్టీ ఎమ్మెల్యే అయ్యారు అచ్చెన్న. ఇన్నాళ్లూ తన మనసులోని కోరికపై ఓపెన్‌ కాని ఆయన.. తాజా పరిణామాలతో అదేంటో బయటపెట్టేశారు.

గత ప్రభుత్వ హయాంలో చిన్న శాఖలు నిర్వహించా అన్న అసంతృప్తి అచ్చన్నలో గట్టిగా ఉండేదట..తనకున్న అనుభవానికి.. సామర్థ్యానికి క్రీడలు,కార్మిక శాఖలు చిన్నవి అని భావించేవారని సమాచారం. ఆ తర్వాత జరిగిన మంత్రివర్గ మార్పుల్లో అచ్చెన్నకు కాస్త కీలక శాఖలు దక్కాయి. బీసీ సంక్షేమం, రవాణా శాఖలను అప్పగించారు. మరోసారి మంత్రివర్గ మార్పులు జరిగితే తనకు హోం మంత్రిత్వ శాఖ వస్తుందని అప్పట్లోనే అచ్చెన్న గట్టిగా లెక్కలు వేసుకున్నారట. అప్పటి హోంమంత్రి చినరాజప్ప ఆ పోస్టుకు సరిపోవడం లేదని.. చంద్రబాబు కూడా ఎన్నికల నాటికి హోంశాఖను అచ్చెన్నకు అప్పగించే చాన్స్ ఉందని పార్టీలో విస్తృత ప్రచారం జరిగింది.

ప్రత్యర్థి వర్గాలతో.. పోలీసులు, అధికారులతో ఘర్షణ సమయంలో పవర్‌లోకి వచ్చేది మేమే అని రాజకీయ నాయకులు ప్రకటన చెయ్యడం సాధారణం. ఈ విషయంలో అచ్చెన్నాయుడు ఇంకో అడుగు ముందుకేశారు. టీడీపీ అధికారంలోకి రావడంతోపాటు నేనే హోంమంత్రి అని ప్రకటించుకున్నారు. అయితే తన వ్యాఖ్యల ద్వారా పోలీసు శాఖను కంట్రోల్ చెయ్యాలని అచ్చెన్న అనుకుంటున్నారా లేక.. ఈసారి అధికారంలోకి వస్తే హోంమంత్రి అవ్వాల్సిందే అని నిర్ణయించుకున్నారా అన్న దానిపై రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది.

ఆయా ప్రాంతాల్లో ఉన్న పోలీసుల కాస్త వెనక్కి తగ్గేలా చేయడమే.. అచ్చెన్న ప్రకటనలోని ఎత్తుగడగా కొందరు చెబుతున్నారు. కాదు కాదు.. పార్టీ అధికారంలోకి వస్తే తనకు ఏ శాఖ ఇవ్వాలో ఇప్పుడే చంద్రబాబుకు చెప్పేసి.. ఆయన్ని ఫిక్స్‌ చేశారని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. అప్పుడే అధికారం మాదే.. ఫలానా శాఖకు నేనే మంత్రి అని చెప్పడమే కొంత విచిత్రంగా ఉందట. కాకపోతే తన మనసులో ఇన్నాళ్లూ గూడు కట్టుకుని ఉన్న కోరికను ఎలాగైతే బయటపెట్టేశారు. అచ్చెన్నాయుడు కల నెరవేరుతుందో లేదో తెలియాలంటే మూడేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల వరకు ఆగాల్సిందే.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version