శ్రీకాకుళం: రాజారెడ్డి రాజ్యాంగానికి మరో మూడేళ్లే వ్యాలీడిటీ ఉందని టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి జగన్, వైసీపీ నేతలు ప్రతి రోజూ పశ్చాత్తాపం పడక తప్పదని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.
కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండం బసలదొడ్డిలో టీడీపీ సానుభూతిపరులకు తాగునీరు నిలిపివేయడం హేయమైన చర్యన్నారు. కులం, చూడం మతం చూడం అని చెప్పిన జగన్ ఇతర పార్టీల వాళ్లకు కనీసం తాగునీరు కూడా ఇవ్వకుండా కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. టీడీపీకి ఓట్లు వేశారని నీళ్లు, ఫించన్, రేషన్ ఆపి వేయడం జగన్ ఫ్యాక్షన్ మనస్తత్వనికి నిదర్శనమన్నారు. సీఎం జగన్ పాలన గాలికొదిలి టీడీపీకి ఓట్లేసిన వారికి సంక్షేమ పథకాలు ఆపి వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోవిడ్ సమయంలోనూ టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతూ రాక్షసానందం పొందుతున్నారని ఎద్దేవా చేశారు. వివాద రహితుడైన టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపి వేధిస్తున్నారని పేర్కొన్నారు. 2 ఏళ్ల పాలనలో దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు, కక్ష్య సాధింపు చర్యలు తప్ప సాధించిన ప్రగతి ఏంటని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో అభివృద్ధిలో ముందున్న రాష్ట్రాన్ని అక్రమ కేసులు, అరాచకాలతో ఆంధ్ర ప్రదేశ్‌ని అక్రమ అరెస్టుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చారని చెప్పారు. రాజారెడ్డి రాజ్యాంగానికి మరో 3 సంవత్సరాలే వ్యాలీడిటీ అని వ్యాఖ్యానించారు.