రాములమ్మని క్రౌడ్‌ పుల్లర్ గా చూస్తారా – కీలక బాధ్యతలు ఇస్తారా ?

-

తెలంగాణ రాజకీయాల్లో రాములమ్మ పరిస్థితి ఎక్కే గడప.. దిగే గడపగా మారింది.మొత్తానికి పాత గూటిలోనే అదృష్టం పరీక్షించుకోవడానికి సిద్ధమయిన రాములమ్మను బీజేపీ ఎలా వాడుకోనుంది. రాములమ్మని క్రౌడ్‌ పుల్లర్ గా చూస్తారా లేక పార్టీలో కీలక బాధ్యతలు ఇస్తారా అన్న దానిపై ఇప్పుడు చర్చ నడుస్తుంది. టీపీసీసీ ప్రచార కమిటీ సారథి విజయశాంతి మరోసారి పార్టీ మారుతున్నారని చర్చ జరుగుతున్న సమయంలో ఈ అంశాలపై అంతా ఫోకస్‌ పెట్టారు.

ఎన్టీఆర్‌ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఆ స్థాయిలో రాజకీయాల్లో ప్రభావం చూపించిన వాళ్లు లేరు. అంతా మఖలో పుట్టి పుబ్బలో అంతర్ధానం అయినవారే. ఇంకొందరు తమ వంతు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు. చాలా పార్టీలు నటీనటులను ఆహ్వానిస్తున్నా.. ఎన్నికల ప్రచార సమయంలో వారు క్రౌడ్‌ పుల్లింగ్‌కు ఉపయోగపడతారనే చూస్తున్నాయి. సమస్యలపై ప్రజలను నటులు చైతన్యం చేయలేకపోవడమే దీనికి కారణం. పైగా ఒక టైమ్‌ పిరియడ్‌ దాటితే.. వెండితెరకు దూరమైనట్టే పొలిటికల్ స్క్రీన్‌కు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తుంది.

హీరోయిన్‌గా విజయశాంతి సిల్వర్‌ స్క్రిన్‌పై ఓ వెలుగు వెలిగారు. తర్వాత బీజేపీలో చేరి తన రాజకీయ ప్రయాణం ప్రారంభించారు. బీజేపీ అగ్రనాయత్వంతో మంచి సంబంధాలు పెంచుకున్నారు. బళ్లారిలో కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియాగాంధీ లోక్‌సభకు పోటీ చేస్తుంటే.. ఆమెపై విజయశాంతిని పెడితే ఎలా ఉంటుందనే చర్చ కూడా బీజేపీ జరిగింది. తెలంగాణ ఉద్యమం పీక్‌లో ఉన్న సమయంలో బీజేపీ నుంచి బయటకొచ్చి తల్లి తెలంగాణ పార్టీ పెట్టుకున్నారు విజయశాంతి. కొన్నాళ్లకు తన పార్టీని టీఆర్‌ఎస్‌లో కలిపేసి.. గులాబీ కండువ కప్పేసుకున్నారామె. ఆ పార్టీ తరఫున మెదక్‌ ఎంపీగానూ గెలిచారు. విజయశాంతిని దేవుడిచ్చిన చెల్లిగా చెప్పారు కేసీఆర్‌.

రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవన్నట్టు.. గులాబీ దళపతి కేసీఆర్‌తో గ్యాప్‌ రావడంతో టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరిపోయారు విజయశాంతి. ఎన్నికల్లో పోటీ చేసిన విజయం వరించలేదు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌ ప్రచార కమిటీ సారథిగా ఉన్నారు. కొత్తలో కాంగ్రెస్‌లో యాక్టివ్‌గా కనిపించినా.. తర్వాత పార్టీ కార్యక్రమాల్లో నల్లపూసయ్యారు విజయశాంతి. ఈ మధ్య చాలా ఏళ్ల గ్యాప్‌ తర్వాత మళ్లీ మేకప్‌ వేసుకుని వెండితెరపై కనిపించారు. అలాగే మరోసారి బీజేపీలో చేరి అదృష్టం పరీక్షించుకోవాలని చూస్తున్నారు రాములమ్మ.

ఒకప్పుడు విజయశాంతి ఉన్న బీజేపీ వేరు.. ఇప్పటి బీజేపీ వేరు. కాకపోతే మాతృపార్టీ. అప్పట్లో అద్వానీతో కలివిడిగా ఉండేవారు విజయశాంతి. ఇప్పుడు బీజేపీలో అద్వానీ స్థానంపై రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడులోనూ విజయశాంతి గ్లామర్‌ ద్వారా ఓట్లు రాబట్టుకోవాలని చూస్తున్నారట కమలనాథులు. అంటే బీజేపీ కూడా రాములమ్మను క్రౌడ్‌ పుల్లింగ్‌ యాక్టర్‌గానే చూస్తున్నారా? లేక కీలక బాధ్యతలు అప్పగించి ప్రాధాన్యం ఇస్తారా అన్నది తెలియాల్సి ఉంది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఇప్పటికే విజయశాంతితో భేటీ అయ్యి మాట్లాడారు. పార్టీలో ఏ విధంగా యాక్టివ్‌ రోల్‌ పోషించాలనుకుంటోంది.. తన పాత్ర ఏంటన్నది రాములమ్మ కేంద్ర మంత్రి దగ్గర స్పష్టం చేసినట్టు సమాచారం. ప్రస్తుతమైతే ఎక్కే గడప దిగే గడపగా మారిన విజయశాంతి.. బీజేపీలో ఏ పాత్ర పోషిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version