‘ఖడ్గం’లో ‘ఒక్క ఛాన్స్’ అంటూ సినీప్రయత్నాలు చేసే యువతిగా కనిపించి.. ‘శివపుత్రుడు’లో గ్రామీణ యువతి పాత్రలో మెప్పించి… గ్లామర్‌తో ‘పెళ్లాం ఊరెళితే’లో అలరించి.. ప్రేక్షకుల్లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది సంగీత. దక్షిణాది భాషల్లో 40కిపైగా సినిమాలు చేసిన ఈమె.. ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తోంది. ఆమె తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొని సందడి చేసింది. పలు ఆసక్తికర విషయాలు చెప్పింది. ఆ సంగతులు..
ఈ కార్యక్రమంలో భాగంగా అలీ.. ఏదైనా సినిమా వదులుకున్నప్పుడు.. అది హిట్ అయి బాధ పడిన సందర్భాలున్నాయా..? అని అడగగా.. “పెద్దగా లేవు. ఒక సినిమా తీసుకుని రెండు, మూడు రోజులు షూటింగ్ అయిపోయిన తర్వాత తొలగించారు. ఎందుకు తీసేశారో నాకు తెలీదు. దాని గురించి వదిలేద్దాం. ‘శివపుత్రుడు’ దర్శకుడు 90 రోజులు డేట్స్ కావాలన్నారు. నేనేమో 19 రోజులు అనుకుని ఓకే అన్నాను. 19 కాదు మళ్లీ 90 అన్నారు. అయితే అప్పటికే నేను తెలుగులో ఎనిమిది సినిమాలు చేస్తున్నా అని చెప్పా. ఒకేసారి అన్ని రోజులు సాధ్యం కాదు. మధ్య మధ్యలో అయితే ఓకే అన్నా… కానీ డైరెక్టర్ ఒప్పుకోలేదు. వేరే హీరోయిన్స్‌తో చేశారు.
అప్పుడు నేను బాలకృష్ణతో చేసే సినిమాలో బాలయ్యకు ఏదో సమస్య వచ్చి షూటింగ్ 25 రోజులు ఆగిపోయింది. అప్పుడే ఫిలింఫేర్‌లో ‘ఖడ్గం’కు చాలా అవార్డులు వచ్చాయి. ఆ సమయంలో డైరెక్టర్ కృష్ణవంశీ గారు ‘ప్రస్తుతం ఏం చేస్తున్నావు’ అని నన్ను అడిగారు. బాల డైరెక్టర్ సినిమా అవకాశం వచ్చిందని, కానీ కుదరలేదని చెప్పాను. అప్పుడు వంశీగారు బాగా తిట్టారు. ‘సిగ్గుందా, బుద్దుందా’ అని చాలా తిట్టారు. బాల సినిమాకు నో చెప్తావా?’ అంటూ అన్నారు. ఇక వెంటనే బాలా గారికి నేను ఫోన్ చేసి సారీ చెప్పా. ఇంకో మూవీ చేస్తే చెప్పండి సార్ డేట్స్ ఇస్తాను అని అన్నాను. దీంతో ఆయన ‘ఇప్పుడేం చేస్తున్నావ’ని అడిగారు. ‘షూటింగ్ ఆగిపోయింద’ని చెబితే ‘వెంటనే మధురై రా’ అని చెప్పారు. ఇప్పుడు షూటింగ్ చేద్దాం అని అన్నారు. నా కోసం వేరే హీరోయిన్‌కి అన్యాయం చేయొద్దని చెబితే… బాలా గారు కూడా తిట్టి నన్ను రప్పించారు. ఇక వెంటనే వెళ్లి మేకప్ వేసుకోగానే ఒక డైలాగ్ ఇచ్చారు. అది చెప్పగానే అందరూ చప్పట్లు కొట్టారు. ఎందుకంటే అప్పటికే 30 హీరోయిన్లతో ఆ సీన్ చేసినా సరిగా రాలేదట. ఆ సినిమా లేకపోతే నేను లేను” అని సంగీతం చెప్పుకొచ్చారు.