మేం స్పెక్ట్రమ్‌ను కొన్నది అందుకే : అదానీ గ్రూప్‌

-

తాజా 5జీ వేలంలో మిల్లీమీటర్‌ బ్యాండ్‌లో సొంతం చేసుకున్న స్పెక్ట్రమ్‌ను తమ వ్యాపారాలు, డేటా సెంటర్ల అవసరాల నిమిత్తం ఏర్పాటు చేసే ప్రైవేటు నెట్‌వర్క్‌ల కోసం వినియోగిస్తామని ఆసియా కుబేరుడు గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌ తెలిపింది. దాదాపు రూ.212 కోట్లు విలువ చేసే స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసినట్లు వెల్లడించింది.

తాజాగా ముగిసిన 5జీ వేలంలో అదానీ 26 గిగాహెర్ట్జ్‌ బ్యాండ్‌లో 400 మెగాహెర్ట్జ్‌ (మొత్తం విక్రయమైన స్పెక్ట్రమ్‌లో 1 శాతం లోపు) స్పెక్ట్రమ్‌ను రూ.212 కోట్లకు కొనుగోలు చేసింది. ముంబయితో పాటు ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో తమ ప్రైవేటు నెట్‌వర్క్‌ కోసం ఈ స్పెక్ట్రమ్‌ను అదానీ గ్రూప్‌ వినియోగించుకోనుంది.

ముఖ్యంగా విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, గ్యాస్‌, విద్యుత్తు.. ఇలా వివిధ రంగాల్లోకి విస్తరించిన అదానీ గ్రూప్‌ ఓ సూపర్‌ యాప్‌ను తీసుకొచ్చే యోచనలో ఉంది. దీనికోసం ఈ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఉపయోగకరంగా ఉంటుందని కంపెనీ భావిస్తోంది.

5జీ స్పెక్ట్రమ్‌ వేలంలో 7 రోజుల్లో రూ.1,50,173 కోట్ల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. 10 బ్యాండ్‌లలో మొత్తం 72,098 మెగాహెర్ట్జ్‌ స్పెక్ట్రమ్‌ను అమ్మకానికి ఉంచగా.. 51,236 మెగాహెర్ట్జ్‌ (71 శాతం) మేర విక్రయమైంది. దీంతో అదానీ గ్రూప్‌ సొంతం చేసుకున్నది చాలా తక్కువ. అయితే, వివిధ రంగాల్లో ఉన్న తమ వ్యాపారాలను సమ్మిళితం చేసి.. వినియోగదారులకు అదనపు సేవల్ని అందించాలన్న లక్ష్యంతో ఈ కంపెనీ ప్రత్యేకంగా స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసింది.

మరోపైపు జియో దేశంలోని 22 సర్కిళ్లలోనూ 5జీ స్పెక్ట్రమ్‌ కోసం రూ.88,078 కోట్ల విలువైన బిడ్లు వేసింది. ఎయిర్‌టెల్‌ 700 మెగాహెర్ట్జ్‌ మినహా, వివిధ బ్యాండ్‌లలో 19,867 మెగాహెర్ట్జ్‌ స్పెక్ట్రమ్‌ను రూ.43,084 కోట్లతో కొనుగోలు చేసింది. వొడాఫోన్‌ ఐడియా రూ.18,799 కోట్ల విలువైన 6228 మెగాహెర్ట్జ్‌ స్పెక్ట్రమ్‌ను సొంతం చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version