కృష్ణపట్నం నుంచి కంటైనర్ పోర్టును తరలిపోనివ్వబోమని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. కంటైనర్ పోర్టు తరలింపుతో పది వేల మంది ఉపాధి కోల్పోతారని అన్నారు.ఎన్డీయే కూటమి ఎంపీలతో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామని.. రైతులు, ఉద్యోగుల కోసం అవసరమైతే ఆదానీ కాళ్లు పట్టుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ కార్యకలాపాలను యథావిధిగా కొనసాగించాలంటూ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. టెర్మినల్ పనులు ఆగిపోతే ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయి పోర్టుపై ఆధారపడ్డ కార్మికులు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కోల్పోతారంటూ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్షం నేతలు తరలిపోయిన కంటైనర్ పోర్టు ప్రాంతాన్ని శుక్రవారం పరిశీలించారు. కంటైనర్ పోర్టును పునరుద్ధరించాలని కోరుతూ పోర్టు సీఈవోకు నేతలు వినతిపత్రం అందజేశారు