మూడేళ్లుగా ఏదో ఒక వైరస్ మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంది. ఏమంటా.. ఆ కరోనా వైరస్ వచ్చిందో కానీ.. మొత్తం సైన్యాన్ని దింపేసినట్లుంది.. వెరైటీ వైరస్‌లు.. అంతుచిక్కని లక్షణాలు.. చాలామట్టుకు వైరస్‌లు చిన్నపిల్లల్నే టార్గెట్ చేస్తున్నాయి.. ఇప్పుడు పశ్చిమబెంగాల్‌లో అడినో వైరస్ వల్ల పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు.. కేవలం 9 రోజుల్లో 36 మంది పిల్లలు మరణించినట్టు అక్కడ ఆరోగ్య శాఖ చెబుతోంది…
ఆరేళ్లలోపు పిల్లలే టార్గెట్..
ఆరేళ్లలోపు పిల్లల పైన ఈ వైరస్ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. నెలల వయసు ఉన్న శిశువులకు కూడా ఈ వైరస్ సోకుతుంది. ఫ్లూ వంటి లక్షణాలతో ఆసుపత్రుల్లో అడ్మిట్ అవుతున్న పిల్లల్లోనే… అధికంగా ఈ వైరస్ కనిపిస్తోందని అక్కడి వైద్యులు చెబుతున్నారు. రెండేళ్లు లేదా అంతకంటే తక్కువ వయసున్న పిల్లలు త్వరగా ఈ వైరస్ బారిన పడుతున్నట్టు చెబుతున్నారు ఆరోగ్య శాఖ అధికారులు.
అడినో వైరస్ అంటే..
అడెనో వైరస్ మనిషిలో చేరితే మెదడు వ్యవస్థ, మూత్ర నాళాలు, కళ్ళు, ఊపిరుతిత్తుల గోడలు, పేగులు వంటి వాటికి హాని కలిగిస్తుంది. ఇది ఒక అంటువ్యాధి. జలుబు ఎలా పక్కవారికి వ్యాపిస్తుందో ఈ శ్వాసకోశ వైరస్ కూడా అలాగే ఇతరులకు తేలికగా వ్యాపిస్తుంది. జలుబుతో మొదలైన ఈ అనారోగ్యం, తీవ్రమైన శ్వాసకోశ పరిస్థితులకు దారితీస్తుంది. ఈ వైరస్ చర్మం, గాలి, నీరు ద్వారా వ్యాపిస్తుంది. దగ్గు మరియు తుమ్ముల ద్వారా ఎదుట వ్యక్తులకు సోకుతుంది.
లక్షణాలు..
సాధారణ జలుబు, జ్వరం, గొంతు మంట, కళ్ళ కలక, కడుపునొప్పి, తీవ్రమైన బ్రాంకైటిస్, నిమోనియా వంటి లక్షణాలు ఈ వైరస్ సోకిన తరువాత కనిపిస్తాయి..
చికిత్స లేదా..?
ఈ వైరస్‌కు ఇప్పటివరకూ ఎలాంటి మందులను కనిపెట్టలేదు. సాధారణ జలుబు, జ్వరం, నిమోనియాకు వాడే మందులనే ఈ వైరస్ బారిన పడిన పిల్లలకు ఇస్తున్నారు. కోవిడ్ సమయంలో ఎలాంటి రక్షణను తీసుకుంటున్నారో.. ఈ వైరస్ విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. చేతులతో కళ్ళు, ముక్కును తాకకుండా ఉండాలని, చేతులను చుట్టూ ఉన్న ప్రాంతాన్ని శానిటైజ్ చేసుకుంటూ ఉండాలని చెబుతున్నారు.
గుండె సంబంధిత సమస్యలు ఉన్న పిల్లలు జాగ్రత్త..
ఏ పిల్లలకైతే గుండె సంబంధిత వ్యాధులు, శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఉంటాయో, వారిలో ఈ వైరస్ త్వరగా సోకుతోంది. అలాగే కిడ్నీ వ్యాధులు ఉన్న వారిపై కూడా ఈ వైరస్ ప్రతాపం చూపిస్తోంది. అలాంటి పిల్లల ప్రాణాలను సులువుగా హరిస్తోంది. కాబట్టి ఈ సమస్యలు ఉన్న పిల్లలను జాగ్రత్తగా కాపాడుకోవాలి.
ఇమ్యునిటీ పవర్ పెంచండి..
రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లల్లో ఈ వైరస్ సులువుగా ప్రవేశిస్తుంది. కాబట్టి పిల్లలకు రోగనిరోధక శక్తిని పెంచే ఆహారన్ని ప్రత్యేకంగా పెట్టాలి.. విటమిన్ సి అధికంగా ఉండే నిమ్మ, స్ట్రాబెర్రీ, నారింజ వంటివి రోజూ పెట్టాలి. క్యారెట్స్, బీన్స్, అల్లం వెల్లుల్లి, ఆకుకూరలతో వండిన వంటలను తినిపించాలి. కప్పు పెరుగు రోజూ ఇవ్వండి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పిల్లలను ఈ వైరస్ నుంచి కాపాడుకోవచ్చు.