జీడిమామిడి పంటలను ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లో పండిస్తారు. రాష్ట్రంలోని నెల్లూరు,శ్రీకాకుళంలో కోస్తా తీర ప్రాంతంలో మూడు లక్షల హెక్టార్లలో పండిస్తున్నారు. ఉత్పత్తి 95 వేల టన్నులు, ఉత్పాదకత ఎకరాకు 280 కేజీలు..జీడి మామిడిని విత్తనం ద్వారా మరియు శాఖీయ పద్ధతుల ద్వారా ప్రవర్ధనం చేయవచ్చును. ప్రవర్ధన పద్దతి ఏదైనా ప్రవర్ధనానికి కావల్సిన విత్తనపు గింజలను లేదా శాఖలకు కొన్ని ప్రత్యేక లక్షణములు గల తల్లి చెట్టు నుండి సేకరించాలి. ఆ లక్షణాలేమనగా చెట్టు ఒత్తుగా కురచ కొమ్మలు, ఎక్కువగా ఉండాలి. ఎక్కువ శాతం ఆడ పువ్వులను కలిగిఉండాలి. మధ్య సైజు కలిగిన గింజలు కలిగి అధిక దిగుబడినిచ్చే విధంగా ఉండాలి..అలాగే చీడలను కూడా తట్టుకోగలగాలి.
గింజలను నాటేముందు రెండు రోజుల పాటు వాటిని నీటిలో నానబెట్టాలి.విత్తనాన్ని నారుగా పెంచిగాని లేక పొలంలో నేరుగా నిర్ణీత భాగాలలో విత్తవచ్చును, విత్తనాన్ని పాలిథీన్ సంచులలో విత్తుట మంచిది. ఈ సంచులలో మట్టి, పశువుల ఎరువును కల్పి నింపవలెను. సంచులలో తేమ ఎక్కువగా ఉంటే విత్తనం కుళ్ళిపోవును. కావున తగినంత తేమను మాత్రమే ఉంచాలి. విత్తనాలు విత్తిన 20-30 రోజులలో మొలకెత్తి 50-60 రోజులలో నాటుటకు సిద్ధంగా ఉంటాయి..