కొవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియలో అధికారుల అలసత్వం బయటపడుతున్నది. టీకాల పంపిణీలో ఉదాసీనతను బహిర్గతం చేసే సంఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. 80ఏండ్ల వృద్ధుడు మృతిచెంది నెలలు గడుస్తున్న తర్వాత కుటుంబ సభ్యులకు ఓ ఎస్‌ఎంఎస్ వచ్చింది. నవంబర్ 16న వయోవృద్ధుడికి కొవిడ్-19 రెండో డోసు టీకా పూర్తయినట్లు ఆ ఎస్‌ఎంఎస్‌లో ఉండటంతో అవాక్కవడం కుటుంబ సభ్యుల వంతైంది. ఈ విషయమై మృతుడు సత్యనారాయణ సింగ్ మనుమడు అంకుర్ సింగ్ సోమవారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.
లోథన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో సత్యనారాయణ సింగ్‌కు వ్యాక్సిన్ రెండో డోసు వేసినట్లు ఎస్‌ఎంఎస్ వచ్చిందని, గుదియా అనే ఏఎన్‌ఎం టీకా వేసినట్లు ఉందని అంకుర్ సింగ్ వెల్లడించారు.
తన తాతకు మొదటి డోసు ఏప్రిల్ 4న వేశారని, ఆ సమయంలో మొబైల్ నెంబర్‌ను రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలిపారు. అయితే, జూన్ 10న సత్యనారాయణ సింగ్ మృతిచెందారు. జూలై 3వ తేదీన డెత్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారని అంకుర్ సింగ్ తెలిపారు.
తన దృష్టికి విషయం వచ్చినట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ సందీప్ సింగ్ చౌధరి తెలిపారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని, టెక్నికల్ ఫాల్ట్ ద్వారా తప్పిదం జరిగిందని వివరించారు.