వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ 2021 సీజన్ కోసం బీసీసీఐ ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తోంది. పదమూడో సీజన్‌ను ఘనంగా నిర్వహించడంతో ఐపీఎల్ పాపులారిటీ మరింతగా పెరిగింది. రాబోయే సీజన్ కోసం ఆటగాళ్లందరూ వేలంలోకి రాబోతున్నట్లు తెలిసింది. వచ్చే ఏడాది ఆరంభంలో పూర్తిస్థాయి వేలాన్ని నిర్వహించనున్నట్లు బీసీసీఐ ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు తెలిపినట్లు సమాచారం. కరోనా వల్ల ఐపీఎల్-2020 సీజన్‌కు యూఏఈ ఆతిథ్యమివ్వగా 2021 సీజన్‌ను మాత్రం భారత్‌లో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది.
ఐపీఎల్ 2021 ఎడిషన్ కోసం తొమ్మిదవ ఫ్రాంఛైజీని చేర్చడానికి బీసీసీఐ ప్రణాళికలు చేస్తోంది. దీంతో మెగా ప్లేయర్ ఆక్షన్ కోసం ప్లాన్ చేస్తున్నారని బీసీసీఐ తెలిపింది. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోని అహ్మదాబాద్ కేంద్రంగా ఫ్రాంఛైజీని ఏర్పాటు చేస్తారని, కార్పొరేట్ దిగ్గజం టీమ్‌ను దక్కించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.