తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే దాక తాను గడ్డం తీయనని మరీ శపథం చేసిన తెలంగాణ పీసీసీ చీఫ్ ని ఆ పార్టీ ఇక పక్కన పెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇదే విషయం చర్చనీయాంశమైంది. గురువారం నుంచి శాసనసభ సమావేశాలు ఆరంభమకానున్న తరుణంలో సీఎల్పీ నేతను ఎన్నుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ లో కసరత్తులు జరుగుతున్నాయి. ఇందుకుగాను ఏఐసీసీ ప్రధానకార్యదర్శి కేసి వేణుగోపాల్ పరిశీలనలో శాసనసభాపక్ష సమావేశం కానుంది. అయితే ప్రధానంగా ఈ పదవి విషయమై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రచారం కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్కలు ప్రధాన పోటీ దారులుగా వినబడుతున్నాయి. అయితే ఉత్తమ్ పై ఇప్పటికే పలువురు నేతలు గుర్రుగా ఉండటంతో ఆయనను ఈ సారి పక్కన పెట్టక తప్పదని తెలుస్తోంది.
ఇదే సమయంలో కాంగ్రెస్ అధిష్టానం ఎస్సీ వర్గానికి చెందిన విక్రమార్కకు పదవిని అప్పగిస్తే రాష్ట్రంలో పార్టీ మరింత బలోపేతం అయ్యేందుకు అవకాశాలుంటాయని యోచిస్తోంది. అన్నింటికంటే ముఖ్యంగా అన్ని పార్టీల నేతలతో సఖ్యతగా ఉండటంతో పాటు..గతంలో డిప్యూటీ స్పీకర్ పదవిని నిర్వహించిన అనుభవం కూడ ఆయనకు కలిసిరానుంది. నల్గొండ జిల్లా నుంచి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం తాను ఈ రేసులో ఉన్నట్లు పలు సార్లు ప్రకటించారు. అయితే అధిష్టానం అన్నింటిని బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఏది ఏమైన తెరాస ప్రభంజనంతో తెలంగాణ కాంగ్రెస్ లో సరైన నాయకుడిని అధ్యక్షుడిగా ఎంపిక చేయడం కోసం కాంగ్రెస్ అధిష్టానం హోం వర్క్ బాగానే చేస్తున్నట్లుంది.