మణిరత్నం తెరకెక్కిస్తున్న చారిత్రక కలల చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’. పాన్ ఇండియా స్టార్స్ తో తీసిన ఈ సినిమాపై రోజురోజుకి అంచనాలు పెరుగుతున్నాయి. ఇటీవలే ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించింది. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించడానికి ప్రచార కార్యక్రమాల్లో జోరు పెంచింది. సెప్టెంబరు 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది.
విక్రమ్, ఐశ్వర్యరాయ్, కార్తి, జయం రవి, త్రిష, శోభిత ధూళిపాళ.. కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎ.ఆర్.రెహమాన్ సంగీత దర్శకుడు. ‘రోజా’ నుంచే మణిరత్నంకి బాలీవుడ్‌లోనూ మంచి మార్కెట్ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అగ్ర కథానాయకుడు అజయ్ దేవ్‌గణ్‌తో హిందీ వెర్షన్‌కి నరేషన్ చెప్పించారు. మణిరత్నం తాజాగా ఈ విషయాన్ని వెల్లడించారు.
‘హిందీ పరిశ్రమలో నేను ఇద్దరికి కృతజ్ఞతలు చెప్పాలి. ఒకరు అనిల్‌కపూర్. హిందీ ట్రైలర్‌కి గొంతునిచ్చారు. రెండో వ్యక్తి అజయ్ దేవ్‌గణ్ సినిమా మొత్తానికి వాయిస్ ఇచ్చారు’ అన్నారు. రెండు భాగాలుగా వస్తున్న ఈ చిత్రాన్ని మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ పతాకంపై మణిరత్నం సహనిర్మాతగా సుభాస్కరన్ నిర్మిస్తున్నారు.