కార్తీక మాసం వచ్చిందంటేనే ఎక్కడలేని ఆధ్యాత్మిక శోభ. అందులోనూ కార్తీక శుద్ధ నవమికి ఉండే ప్రత్యేకతే వేరు. ఈ రోజును ‘అక్షయ నవమి’ లేదా ‘ఉసిరి నవమి’ అని పిలుస్తారు. ‘అక్షయం’ అంటే ఎప్పటికీ నశించనిది తగ్గనిది అని అర్థం. ఈ పవిత్ర దినాన మనం చేసే ఏ చిన్న పుణ్యకార్యమైనా, దానమైనా కోటి రెట్ల ఫలాన్ని ఇస్తుందని, మన పాపాలన్నీ నశించిపోతాయని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ అద్భుతమైన రోజు (నవంబర్13) వెనుక ఉన్న విశిష్టత, ఆచరించాల్సిన పద్ధతులు తెలుసుకుందాం..
పురాణ కథ: కార్తీక మాసంలో వచ్చే అక్షయ నవమి రోజున శ్రీమహావిష్ణువు ఉసిరి చెట్టుపై కొలువై ఉంటాడని ప్రగాఢ విశ్వాసం. అందుకే ఈ రోజున ఉసిరి చెట్టును పూజించడం అత్యంత శ్రేయస్కరం. ఈ పవిత్ర దినాన సత్యయుగం ప్రారంభమైందని, లోకకళ్యాణం కోసం విష్ణుమూర్తి కూష్మాండుడనే రాక్షసుడిని సంహరించాడని పురాణాలు చెబుతున్నాయి.

పూజ విధానం: అక్షయ నవమి నాడు ఉదయాన్నే పవిత్ర స్నానమాచరించి, ఉసిరి చెట్టుకు పూజ చేసి, దీపం వెలిగించి, ప్రదక్షిణలు చేయడం వలన సకల శుభాలు కలుగుతాయి. ముఖ్యంగా సంతానం లేని వారు, సౌభాగ్యాన్ని కోరుకునే స్త్రీలు ఉసిరి చెట్టు కింద వన భోజనం చేయడం, బ్రాహ్మణులకు దానం చేయడం వలన అంతులేని సంపద, సంతానం, ఆయురారోగ్యాలు చేకూరతాయని నమ్మకం. ఈ రోజు చేసే దానధర్మాలు, జపాలు, తపస్సులు, పితృదేవతలకు తర్పణాలు తరతరాలుగా తరగని పుణ్యాన్ని ఇస్తాయి.
అందుకే అక్షయ నవమిని పాపాలను నశింపజేసి, అంతులేని పుణ్య ఫలాలను ఇచ్చే పవిత్రమైన రోజుగా హిందువులు భావిస్తారు. ఈ శుభ దినాన్ని సద్వినియోగం చేసుకుని ఆ శ్రీమన్నారాయణుడి కృపకు పాత్రులమవుదాం.
గమనిక: పైన తెలిపిన ఆచారాలు, నమ్మకాలు హిందూ సంప్రదాయాలను, పురాణాలను అనుసరించి ఇవ్వబడినవి.
