చిన్న ఇన్‌ఫెక్షన్, ఒక్కోసారి అది ప్రాణాంతకమైన బ్లడ్ ఇన్‌ఫెక్షన్ (సెప్సిస్) గా మారవచ్చు. ఇది చాలా వేగంగా వ్యాపించే, ప్రాణాలు తీసే తీవ్రమైన పరిస్థితి. ఈ సెప్సిస్ మొదలైన తొలి సంకేతాలను తప్పక గుర్తించాలి. ఎందుకంటే చికిత్సలో కాస్త ఆలస్యమైనా అది ముఖ్య అవయవాలను దెబ్బతీసి, ప్రాణాలకే ప్రమాదం కలిగించవచ్చు. మరి ఈ ఇన్‌ఫెక్షన్ గురించి తెలుసుకుందాం..
శరీరంలో ఎక్కడైనా ఇన్‌ఫెక్షన్ (ఉదాహరణకు, న్యుమోనియా, యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్) ఉన్నప్పుడు, ఆ ఇన్‌ఫెక్షన్‌తో పోరాడటానికి రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందించడం వల్ల సెప్సిస్ సంభవిస్తుంది. దీనిని సాధారణంగా బ్లడ్ పాయిజనింగ్ అని కూడా అంటారు. సెప్సిస్ తొలి సంకేతాలు సాధారణ ఫ్లూ లక్షణాల మాదిరిగా ఉండవచ్చు, కానీ వాటి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా గమనించవలసిన తొలి సంకేతం విపరీతమైన వణుకుతో కూడిన జ్వరం (Fever) లేదా అసాధారణంగా తక్కువ శరీర ఉష్ణోగ్రత ఉండటం.

రెండవది గుండె వేగం పెరగడం మరియు వేగంగా శ్వాస తీసుకోవడం. మూడవది తీవ్రమైన గందరగోళం లేదా స్పృహలో మార్పులు రావడం. నాల్గవది మూత్ర విసర్జన బాగా తగ్గిపోవడం లేదా తీవ్రమైన నొప్పి కలగడం. ఈ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే చికిత్స ప్రారంభించకపోతే ఇన్‌ఫెక్షన్ నియంత్రణ తప్పిపోయి, శరీరంలోని ముఖ్య అవయవాలైన కిడ్నీలు ఊపిరితిత్తులు మరియు గుండె పనితీరు దెబ్బతింటుంది చివరికి షాక్‌కు దారితీసి, మరణం సంభవించవచ్చు.
సెప్సిస్ అనేది ఒక వైద్య అత్యవసర పరిస్థితి. జ్వరం, గుండె వేగం, శ్వాస వేగం మరియు గందరగోళం వంటి లక్షణాలు గమనించిన వెంటనే నిమిషాల వ్యవధిలో వైద్య సహాయం తీసుకోవడం మీ ప్రాణాలను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన మాత్రమే, మీకు తెలిసిన వారికి ఇన్‌ఫెక్షన్ ఉన్నప్పుడు పైన చెప్పిన లక్షణాలలో ఏవైనా కనిపిస్తే, ఆలస్యం చేయకుండా వెంటనే ఎమర్జెన్సీ వైద్య సహాయం పొందాలి.
