ఆ జంపింగ్ ఎమ్మెల్యే టీడీపీ కోవ‌ర్టా… వైసీపీలో క‌ల‌క‌లం..!

-

క‌ర‌ణం బ‌లరామ కృష్ణ‌మూరి. రాజ‌కీయాల్లో సీనియ‌ర్ మోస్ట్‌. దాదాపు 30 ఏళ్లుగా ఆయ‌న రాజ‌కీయాలు చేస్తున్నారు. దాదాపు ఒకే పార్టీలో ఆయ‌న చాలా ఏళ్లు గా చ‌క్రం తిప్పారు. అలాంటి నేత‌పై ఇప్పుడు ప్ర‌కాశంజిల్లాలో పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది. ఆయ‌న క‌ద‌లిక‌ల‌పై నిఘా పెట్టిన చీరాల మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయ‌కుడు ఆమంచి కృష్ణ‌మోష‌న్ తాజాగా బాంబు పేల్చారు. క‌ర‌ణం బ‌ల‌రాం.. త‌న స్వ‌ప్ర‌యోజ‌నాల కోస‌మే కాదు.. చంద్ర‌బాబు క‌నుస‌న్న‌ల్లోనే పార్టీ మారి వైసీపీలో ఉన్నార‌ని.. ఆయ‌న వ్య‌వ‌హారాన్ని ఆధారాల‌తోపాటు బ‌య‌ట పెడ‌తాన‌ని అంత‌ర్గ‌త స‌మావేశంలో ఆమంచి వ్యాఖ్యానించినట్టు తెలిసింది. దీంతో ఒక్క‌సారిగా క‌ర‌ణం వ్య‌వ‌హారం చ‌ర్చ‌కు వ‌చ్చింది.

ఆది నుంచి క‌ర‌ణం.. వివాదాస్ప‌ద నాయ‌కుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయ‌న‌కు ఎవ‌రితోనూ పొస‌గ‌దు. ఇది ఎప్ప‌టి నుంచో ఆయ‌న‌పై ఉన్న వ్యాఖ్య‌లే. ఈ విష‌యంపై జిల్లాలోను, టీడీపీలోనూ చ‌ర్చ‌కు వ‌చ్చేవి.  అయితే, ఇప్పుడు సంచ‌ల‌న విష‌యం ఒక‌టి వెలుగు చూసింది. ఆయ‌న గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో చీరాల‌లో విజ‌యం సాధించారు. అయితే, అనూహ్యంగా ఆయ‌న త‌న కుమారుడు వెంక‌టేష్‌ను తీసుకువ‌చ్చి వైసీపీలోచేర్పించి.. తాను కూడా మ‌ద్ద‌తు దారుగా మారిపోయారు. ఇక‌, అప్ప‌టి నుంచి మాకు అది కావాలి.. ఇది కావాలి.. అని వైసీపీలో చ‌ర్చించి అనుకూల నిర్ణ‌యాలు తీసుకునేలా చేసి.. త‌మ ప‌నులు చేయించుకుంటున్నారు.

అదే స‌మ‌యంలో త‌మ‌కు అనుకూల‌మైన అధికారుల‌ను బ‌దిలీపై తెప్పించుకున్నారు. ఇంత వ‌ర‌కు క‌ర‌ణం ప‌రిమిత‌మైతే బాగానే ఉండేది. కానీ, ఇంత‌కు మించి ఆయ‌న వ్య‌వ‌హార శైలి ఉండ‌డ‌మే ఇప్పుడు వివాదానికి కార‌ణ‌మ‌వుతోంది. అదేంటంటే.. టీడీపీలో ఉన్న‌ప్పుడు పార్టీలో ముఖ్యుల కోసం వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేశారు. టీడీపీ వీఐపీ గ్రూప్‌గా వ్య‌వ‌హ‌రించే దీనిలో మొత్తం 35 మంది నాయ‌కులు ఉన్నారు. వీరిలో చంద్ర‌బాబు, లోకేష్‌, య‌న‌మ‌ల వంటి దిగ్గ‌జ నాయ‌కులు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. దీనికి అడ్మిన్‌గా ఉన్న‌వారిలో క‌ర‌ణం బ‌ల‌రాం కూడా ఉన్నారు. అయితే, ఆయ‌న పార్టీ మారిన‌ప్పుడు.. ఖ‌చ్చితంగా టీడీపీతో ఉన్న అన్ని అనుబంధాలు తెంచుకుని రావాలి.

కానీ, బ‌ల‌రాం మాత్రం టీడీపీ వీఐపీ వాట్సాప్ గ్రూప్‌లో ఇప్ప‌టికీ అడ్మిన్‌గానే ఉన్నార‌ని మాజీ ఎమ్మెల్యే ఆమంచి ఆరోపిస్తున్నారు. అంతేకాదు, నిత్యం వైసీపీలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను క‌ర‌ణం కుమారుడు వెంక‌టేష్‌.. నారా లోకేష్‌కు చేర‌వేస్తున్నార‌ని ఆయ‌న చెబుతున్నారు. ఆయ‌న వైసీపీ సానుభూతి ప‌రుడిగా ఉంటూ టీడీపీకి కోవ‌ర్టుగా ప‌ని చేస్తున్నార‌ని ఆమంచి ఆరోపిస్తున్నారు. అంతేకాదు, ప‌రిటాల శ్రీరాం, ఎంపీ రామ్మోహ‌న్‌నాయుడితోనూ వెంక‌టేష్‌కు స‌న్నిహిత సంబంధాలు కొన‌సాగుతున్నాయ‌ని.. ఇది వైసీపీకి ద్రోహం చేసేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. దీంతో ఒక్క‌సారిగా వివాదం ర‌గులుకుంది. దీనిపై ఆధారాల‌తో త్వ‌ర‌లోనే తాను బ‌ట్ట‌బ‌య‌లు చేస్తాన‌ని ఆమంచి చెప్పుకొచ్చారు. మ‌రి ఇది ఎటు దారితీస్తుందో ? చూడాలి.

-Vuyyuru Subhash 

Read more RELATED
Recommended to you

Exit mobile version