ఏపీలో రాజధాని మార్పు అంశంపై అమరావతి రైతుల రగడ కొనసాగుతోంది. తమ పోరును మరింత ఉద్ధృతం చేస్తామని రాజధాని అమరావతి జేఏసీ నేతలు స్పష్టం చేశారు. ఇక మహిళలపై పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా నేడు రాజధాని బంద్‌కు రైతులు, రైతు కూలీలు పిలుపునిచ్చారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న తమ పట్ల పోలీసులు అనైతికంగా వ్యవహరించారని మహిళలు మండిపడ్డారు. అయితే రైతులు పోలీసులు మధ్య ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పోలీసుల పట్ల కఠినంగా వ్యవహరించాలని రాజధాని గ్రామాల రైతులు నిర్ణయించుకున్నారు. వాళ్లకు కనీసం మంచినీళ్ల సౌకర్యం కూడా కల్గించకూడదనుకున్నారు. తమ దుకాణాల ముందు కూర్చోవడానికి కూడా పోలీసులకు అనుమతి ఇవ్వడం లేదు.
దీంతో పోలీసులు, గ్రామస్థుల మధ్య వాగ్వాదం జరిగింది. కొందరు పోలీసులు ఆందోళనలు చేస్తున్న రైతుల కాళ్లు పట్టుకుున్నారు. శుక్రవారం మహిళల పట్ల ప్రవర్తించిన అనుచిత తీరుకు క్షమాపణలు చెప్పారు. కాళ్లు పట్టుకొని తమను క్షమించాలని కోరారు. కాగా, నేడు సకల జన సమ్మెతో రాజధాని జనజీవనం స్తంభించింది. అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఇచ్చిన ఈ సమ్మె పిలుపును స్వచ్ఛందంగా గ్రామాలు పాటించాయి. ఎక్కడికిక్కడ రైతులు, మహిళలు పెద్దఎత్తున రోడ్డు మీదకు వచ్చి తొలిరోజు శాంతియుతంగా సమ్మెను విజయవంతం చేశారు. అయితే, ఈ సమ్మె పిలుపును భగ్నం చేసే ప్రయత్నంలో పోలీసులు తమ ప్రతాపాన్నంతా మహిళలపై చూపించారు.