భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి కరివేపాకులను తమ వంటల్లో ఉపయోగిస్తున్నారు. ఇవి చక్కని సువాసనను కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని సూప్‌లు, కూరలు, బిర్యానీలు, మసాలా వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. కొందరు కరివేపాకుతో కారం పొడి చేసుకుని కూడా నిత్యం తింటారు. కరివేపాకులను నిజానికి పలు ఆయుర్వేద ఔషధాల తయారీలోనూ వాడుతారు. ఈ ఆకుల్లో విటమిన్లు ఎ, బి, సి, బి2లతోపాటు కాల్షియం, ప్రోటీన్లు, అమైనో యాసిడ్లు, ఫాస్ఫరస్, ఫైబర్, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
కరివేపాకుల్లో ఆల్కలాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ ఆకులు యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, ఇన్‌సెక్టిసైడల్, యాంటీ కార్సినోజెనిక్, యాంటీ మైక్రోబియల్, యాంటీ డయాబెటిస్ గుణాలను కలిగి ఉంటాయి. అందువల్లే కరివేపాకులను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు.
కరివేపాలకు నేరుగా అలాగే నిత్యం తినవచ్చు. లేదా ఆ ఆకులను నీడలో ఎండబెట్టి పొడి చేసి, దాన్ని నిత్యం తీసుకోవచ్చు. అలాగే కరివేపాల నుంచి తీయబడే ఎసెన్షియల్ ఆయిల్ కూడా మనకు మార్కెట్‌లో లభిస్తుంది. దాన్ని కూడా మనం వాడవచ్చు.
వెంట్రుకలకు…
చాలా మందికి యుక్త వయస్సులో, కొందరికి ఇంకా చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడుతుంది. అలాంటి వారు కరివేపాకులను వాడవచ్చు. ఇవి వెంట్రుకలు నల్లగా అయ్యేందుకు ఉపయోగపడతాయి. అలాగే వెంట్రుకలు బాగా పెరిగేందుకు సహాయ పడతాయి. కరివేపాకుల పొడిని కొబ్బరినూనెలో కలిపి ఆ మిశ్రమాన్ని తలకు బాగా మర్దనా చేయాలి. దాన్ని రాత్రంతా అలాగే ఉంచి మరుసటి రోజు ఉదయాన్నే తలస్నానం చేయాలి. వారంలో ఇలా కనీసం 2 నుంచి 3 సార్లు చేస్తే వెంట్రుకలు నల్లబడడమే కాదు, జుట్టు దృఢంగా, ఒత్తుగా పెరుగుతుంది.
డయాబెటిస్…
కరివేపాకులను నిత్యం తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. ఈ ఆకులను తినడం వల్ల పాంక్రియాస్‌లో ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. అలాగే మనం తినే ఆహార పదార్థాల్లో ఉండే కార్బొహైడ్రేట్ల ద్వారా శరీరంలో షుగర్ లెవల్స్ పెరగకుండా ఉంటాయి.
కొలెస్ట్రాల్…
మన శరీరంలో ఉండే ఎల్‌డీఎల్ (చెడు కొలెస్ట్రాల్)ను తగ్గించడంలో కరివేపాకులు అమోఘంగా పనిచేస్తాయి. నిత్యం కరివేపాకులను తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఈ ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఎల్‌డీఎల్‌ను తగ్గిస్తాయి. అదే సమయంలో హెచ్‌డీఎల్ (మంచి కొలెస్ట్రాల్)ను పెంచుతాయి. దీని వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
ఫ్రీ ర్యాడికల్స్…
మన శరరీంలో పలు రకాల జీవక్రియల వల్ల ఫ్రీ ర్యాడికల్స్ ఏర్పడుతుంటాయి. వీటిని అణచివేయడానికి యాంటీ ఆక్సిడెంట్లు అవసరం. కానీ యాంటీ ఆక్సిడెంట్లు కొందరిలో ఉండవు. అందుకని వారు యాంటీ ఆక్సిడెంట్లు ఉండే ఆహారాలను తినాలి. అందుకు కరివేపాకులు మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. వీటిని తినడం వల్ల శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లు చేరుతాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను అంతం చేస్తాయి. వాటి వల్ల శరీరానికి నష్టం కలగకుండా చూస్తాయి.
అధిక బరువు…
అధిక బరువు తగ్గాలనుకునే వారు కరివేపాకులను నిత్యం తమ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతాయి. కొవ్వును కరిగించడంలో సహాయ పడతాయి. అందువల్ల అధిక బరువు తగ్గుతారు.
గాయాలు…
కాలిన గాయలు, పుండ్లు, దెబ్బలను త్వరగా మాన్పించేందుకు కరివేపాకులు బాగా ఉపయోగపడతాయి. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ గుణాలు గాయాలను త్వరగా మానుస్తాయి. ఇన్ఫెక్షన్లు రాకుండా చూస్తాయి.