టీ20 వరల్డ్ కప్ 2024లో ఊహించని ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ టోర్నీ నుంచి శ్రీలంక, న్యూజిలాండ్ వంటి జట్లు గ్రూపు దశలోనే నిష్క్రమించగా.. తాజాగా పాకిస్తాన్ కూడా ఇంటి దారి పట్టే సమయం వచ్చేసింది. పాకిస్థాన్‌ను యూఎస్‌ఏ ఇంటికి పంపింది. తొలి మ్యాచ్‌లో అమెరికాపై ఓడిపోవడం పాక్ కొంపముంచింది. అమెరికా తమ చివరి గ్రూప్ మ్యాచ్ ఆడకుండానే పాకిస్థాన్‌ను ఇంటికి పంపడం గమనార్హం.
శుక్రవారం రాత్రి యూఎస్‌ఏ, ఐర్లాండ్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దు అయింది.. దీంతో పాక్ అవుట్ ఆఫ్ ది టోర్నీ అయింది. సూపర్ 8కు చేరకుండానే.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. యూఎస్‌ఏ వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్ రద్దు అవ్వకముందు.. అమెరికా ఖాతాలో 4 పాయింట్లు ఉన్నాయి. యూఎస్‌ఏ ఐర్లాండ్ చేతిలో ఓడిపోతే.. పాకిస్థాన్‌కు సూపర్ 8 అవకాశాలు ఉండేవి. అసలు మ్యాచే జరగలేదు. దీంతో రెండు జట్లుకు చెరొక పాయింట్ ఇచ్చారు. ఐదు పాయింట్లతో యూఎస్‌ఏ సూపర్ 8కు క్వాలిఫై అయిపోయింది. ఇక పాకిస్థాన్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఐర్లాండ్ ఎంత భారీ తేడాతో నెగ్గినా కానీ ఇంటి బాటపట్టడం ఖాయమే.