చేవెళ్ల సభ వేదికగా కేంద్రమంత్రి అమిత్ షా బీఆర్ఎస్, కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని కావాలని సీఎం కేసీఆర్ కలలు కంటున్నారు కానీ ఢిల్లీలో ప్రధాని కుర్చీ ఖాళీగా లేదన్న విషయాన్ని కేసీఆర్ గుర్తించుకోవాలని సూచించారు. అంతేకాకుండా.. ‘ వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ గెలవడం ఖాయం. తెలంగాణలో యువతకు అన్యాయం జరుగుతోంది. టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి… పదో తరగతి పేపర్ కూడా లీక్ అయింది. తెలంగాణలో ఏ పరీక్ష నిర్వహించినా పేపర్ లీక్ అవుతోంది. ఏ ఒక్క పరీక్షను సక్రమంగా నిర్వహించలేని వారికి పాలన అవసరమా? లక్షలాది యువత భవిష్యత్తును కేసీఆర్ సర్కారు నాశనం చేస్తోంది. ఎన్నికల సమరాంగణంలో యువతే కేసీఆర్ కు తగిన బుద్ధి చెబుతుంది. టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి.
ప్రధాని కావాలని కేసీఆర్ కలలు కంటున్నారు. ప్రధాని సీటు ఖాళీగా లేదన్న విషయాన్ని కేసీఆర్ తెలుసుకోవాలి. వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీనే గెలుస్తుంది… మోదీనే మరోసారి ప్రధాని అవుతారు. కేసీఆర్ తన ముఖ్యమంత్రి పీఠం కాపాడుకుంటే చాలు! కేసీఆర్ కుటుంబం తెలంగాణను ఏటీఎంగా మార్చుకుంది. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తించారు. ఒవైసీ అజెండానే కేసీఆర్ అమలు చేస్తున్నారు. కారు స్టీరింగ్ ఎంఐఎం చేతుల్లో ఉంది. ఇక్కడి ప్రభుత్వం తెలంగాణ విమోచన దినం కూడా. నిర్వహించడంలేదు.
కానీ, బీజేపీ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో విమోచన వేడుకలను నిర్వహించి చూపించింది. అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మరింత ఘనంగా నిర్వహిస్తాం. బీజేపీ ఎప్పుడూ ఎంఐఎంకు భయపడేది లేదు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తాం. తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి. తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో బీజేపీని గెలిపించాలని తెలంగాణ ప్రజానీకాన్ని కోరుతున్నా.’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు.