అమృతం… తెలుగు టీవీ చరిత్రలో ఈ సీరియల్ ఒక సంచలనం. అతి తక్కువ కాలంలో అమృతం సీరియల్ తెచ్చుకున్న గుర్తింపు ఇప్పటి వరకు ఏ సీరియల్ తెచ్చుకోలేదు. హింది వాళ్ళు కూడా భాష అర్ధం కాకపోయినా ఈ సీరియల్ ని చూసే వారు. గుణ్ణం గంగరాజు నిర్మాతగా వచ్చిన ఈ టీవీ షో ఒక ఊపు ఊపేసింది అనే చెప్పాలి. జస్ట్ ఎల్లో అనే బ్యానర్‌పై ‘అమృతం’ టీవి సీరియల్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.
ఇప్పుడు కూడా ఈ సీరియల్ ఏదోక ఛానల్ లో వస్తూనే ఉంటుంది. అందులో నటించిన నటులు కూడా బాగానే ఫేమస్ అయ్యారు. ఈ షో వస్తుంది అంటే చాలు టిఆర్పీ రేటింగ్స్ భారీగా వస్తాయి కాబట్టి ఇప్పటికీ ఈ షో కి ఆదరణ ఉంది. సరిగా 19 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ సీరియల్ కథ ఒక హోటల్ చుట్టూ తిరుగుతూ ఉండేది. అమృతం సంగీతం కూడా ఒక సంచలనమే. 90 ల్లో పుట్టిన పిల్లలు ఇప్పటికి యుట్యూబ్ లో అమృతం కోసం వెతుకుతూనే ఉంటారు.
ఈటీవీ ప్లస్‌లో అమృతంని పున: ప్రసారం చేశారు. ప్రేక్షకులు ఇప్పటికి ఆదరిస్తూనే ఉన్నారు. గతంలో మాటీవీ లో ఈ సీరియల్ వచ్చేది. దీనికి మంచి ఆదరణ రావడంతో జీ తెలుగు ఛానల్ వారు వెబ్ సీరీస్ చెయ్యడానికి సిద్దమయ్యారు. ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టిన ఈ సీరియల్ అమృతం 2 అనే టైటిల్ తోనే ప్రేక్షకుల ముందుకి వస్తుంది. ‘మూర్ఖత్వానికి మరణం లేదు’ అనే ట్యాగ్ లైన్ తో వస్తుంది ఈ సీరియల్.
ఈ సీరియల్ ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు రాజమౌళి ట్విట్టర్‌లో విడుదల చేసారు. అమృతం ద్వితీయం అద్భుతీయం అనే కామెంట్ కూడా చేసారు ఆయన. కన్నీళ్లు తెప్పించే సీరియల్స్ ఉన్న కాలంలో కామెడీతో ఈ షో ఒక చరిత్ర సృష్టించిందని జక్కన్న పేర్కొన్నారు. ఐదు సార్లు ప్రసారమైన ఏకైక సీరియల్, 270 మిలియన్ వ్యూస్, గడిచిన కొద్ది నెలలుగా 6 మిలియన్ వ్యూస్ సాధించిన సీరియల్ అని ఆయన వ్యాఖ్యానించారు.
అమృతరావు పాత్రకు హర్షవర్ధన్ ని మళ్ళీ తీసుకున్నారు. ఆయన స్నేహితుడు ఆంజనేయులు గుండు హనుమంత రావు అమృతంలో చేయగా… ఆయన ఇప్పుడు మరణించడం తో సీనియర్ నటుడు ఎల్బీ శ్రీరామ్ ఆ పాత్రను చేస్తున్నారు. అప్పాజీ, సర్వం పాత్రలను ముందు చేసిన వారే చేస్తున్నారు. అమృతం 2 ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకి వస్తుంది. మార్చి 25 నుంచి జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ ట్రైలర్ యుట్యూబ్ లో ఇప్పుడు టాప్ 1 ట్రెండి౦గ్ లో ఉంది.