ఏపీలో మే 13న ఎన్నికలు జరిగాయి. పోలింగ్ బూతులకు ఓటర్లు భారీగా తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అర్బన్ ప్రాంతాల్లో కంటే గ్రామీణ నియోజకవర్గాల్లో మహిళలు, వృద్ధులు తండోపతండాలకు తరలివచ్చి ఓటు వేశారు. సాయంత్రం 6 తర్వాత క్యూలైన్లో బారులు తీరి మరీ ఓటింగ్లో పాల్గొన్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో అత్యధికంగా పోలింగ్ శాతం నమోదు అయింది. ఇలా రాష్ట్రంలో 81.86 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది.
దీంతో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. రాష్ట్రంలో 81.86 శాతం పోలింగ్ నమోదవ్వడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన పోటీ చేసిన విషయం తెలిసిందే. ఆ నియోజకవర్గంలోనూ ఓటర్లు భారీ గా ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. దీంతో పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. భారీ పోలింగ్ శాతం నమోదు కావడంపై ఆనందం వ్యక్తం చేశారు. సుస్తిర ప్రభుత్వం, సంక్షేమం, అభివృద్ధి, శాంతి భద్రతల కోసం ఓటు వేశారన్నారు. ఎన్నికల్లో ప్రజలు చూపిన ప్రేమకు తాను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.