ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. ఓవైపు అధికార వైసీపీ, మరోవైపు ప్రతిపక్ష టీడీపీ-జనసేన-బీజేపీ..ఇంకో వైపు కాంగ్రెస్ వంటి పార్టీలు ఎవ్వరి ధీమాలో వారు ఉన్నారు. అధికారంలోకి వచ్చేది మేము అంటే మేము అంటూ జోరుగా ప్రచారాలు చేస్తున్నారు. మరికొందరూ టికెట్లు దక్కకపోవడంతో పార్టీలు మారుతున్నారు.
ముఖ్యంగా ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ టీడీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. దీంతో టికెట్ ఆశించి భంగపడిన నాయకులు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీకి గుంటూరులో భారీ షాక్ తగిలేలా కనిపిస్తోంది. టీడీపీ కి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో ఆయన వైసీపీలో చేరనున్నట్లు రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జోరందుకుంది. తన కార్యకర్తలు, ముఖ్య నాయకులతో చర్చించిన తరువాత పార్టీ మారే అంశంపై ఓ నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్లుగా తెలుస్తోంది.