కేంద్ర ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా హాజరయ్యారు. ఎన్నికలు, పోలింగ్ అనంతరం రాష్ట్రంలోని పలుచోట్ల చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఈసీకి వివరణ ఇచ్చారు. వీరితో పాటు నిఘా విభాగాధిపతి కుమార్ విశ్వజిత్ సైతం ఉన్నారు. మాచర్ల, నరసరావుపేట, చంద్రగిరి, తాడిపత్రిలలో హింస చెలరేగడంపై ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో విచ్చల విడిగా దాడులు, వాహనాలు తగులబెట్టడం వంటి ఘటనల్ని ఎందుకు అదుపు చేయలేకపోయారని ఈసీ నిలదీసింది.
పరిస్థితిని అదుపుచేయకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించిన ఈసీ.. దీనికి బాధ్యులు ఎవరంటూ మండిపడింది. హింసాత్మక ఘటనలు జరిగాక ఏం చర్యలు తీసుకున్నారో తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని నిన్న ఆదేశాలు జారీ చేయడంతో గురువారం సీఎస్, డీజీపీ దిల్లీలో ఎన్నికల సంఘం అధికారుల ఎదుట హాజరై వివరణ ఇచ్చుకున్నారు. దాదాపు 20 నుంచి 25 నిమిషాల పాటు ఎన్నికల సంఘం అధికారులు వీరి నుంచి వివరణ తీసుకొని పంపించినట్లు తెలుస్తోంది. పల్నాడు, తాడిపత్రిల్లో దాడులు, చంద్రగిరిలో ఏకంగా తెదేపా అభ్యర్థిపైనే దాడిచేయడం, శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు వరుసగా జరిగిన ఘటనలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముందుగానే ఆదేశించినా.. అధికారులు పూర్తిగా నిర్లిప్తంగా వ్యవహరించడంపై మండిపడినట్లు తెలుస్తోంది.