పొలిటికల్ పొలికేక : ఏపీకి మరో కొడాలి నాని దొరికాడ్రా!

-

ఏపీకి మ‌రో కొడాలి నాని దొరికేశాడు. ఇంకేం లోటు లేదు.రెచ్చిపోవ‌డ‌డం ఒక్క‌టే మిగిలి ఉంది.ఎందుకంటే ఏపీలో మంత్రుల‌పై ముఖ్య‌మంత్రి స్థాయిలో నియంత్ర‌ణ ఉండక‌పోవ‌డ‌మే ఇంత‌టి అశాంతికి కానీ ఆందోళ‌న‌తో కూడిన ప‌రిణామాలు నెల‌కొనేందుకు కానీ కార‌ణం. ఈ నేప‌థ్యంలో కాస్తో కూస్తో త‌గ్గి ఉండ‌డంలో త‌ప్పేం లేద‌న్న వాద‌న అటు ప్ర‌జ‌ల నుంచి ఇటు సొంత పార్టీ మ‌నుషుల నుంచి వినిపిస్తున్నా వివాదాస్ప‌ద మంత్రులు అస్స‌లు త‌గ్గ‌డం లేదు. స‌రిక‌దా రోజుకో వివాదం రాజేస్తూ మీడియాలో హైలెట్ అయ్యేందుకే తెగ త‌ప‌న ప‌డుతున్నారు. లేదా తాప‌త్ర‌యం చెందుతున్నారు.వీటి కార‌ణంగా ప్ర‌జా స‌మ‌స్య‌లు ఏవీ ప‌రిష్కారానికి నోచుకుని నెగ్గుకు రావ‌డం లేదు.

మొన్న‌టి వ‌ర‌కూ కొడాలి నాని క్యాసినో వివాదం తీవ్ర స్థాయిలో న‌డిచింది. దీనిపై చాలా రాజ‌కీయ దుమారం రేగింది. విజ‌య‌వాడకు ద‌గ్గ‌ర్లో గుడివాడ కేంద్రంగా న‌డిచిన క్యాసినో వివాదం ఇంకా న‌డుస్తూనే ఉంది. దీనిపై టీడీపీ యువ ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు ఢిల్లీ స్థాయిలో ఫిర్యాదు చేశారు. ఎన్ఫోర్మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారుల‌ను క‌లిసి స‌మ‌స్య‌ను వివ‌రించి,త‌క్ష‌ణమే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. ఈ వివాదం మిగిలి ఉండ‌గానే మ‌రో వివాదం రేగింది. అదే నిన్న‌టి వేళ మంత్రి సీదిరి దూకుడు నైజం కార‌ణంగా విశాఖ శార‌దా పీఠం ప్రాంగ‌ణాన తీవ్ర ఉద్రిక్త‌త మ‌రియు ఉత్కంఠ‌త నెల‌కొన్నాయి.

గ‌తంలో కూడా మంత్రి ఇదే విధంగా కొన్ని వివాదాలు రాజేశారు. స‌రిహ‌ద్దు వివాదాల్లో దూకుడుగా వ్య‌వ‌హ‌రించి ఆ రోజు ఆయ‌న హీరో అయ్యారు. అక్క‌డివ‌ర‌కూ స‌మ‌స్య ప‌రిష్కారం విష‌యమై ఒడిశా అధికారులను బెదిరించి ఆఖ‌రికి అక్క‌డి క‌లెక్ట‌ర్ ను కూడా అరెస్టు చేయిస్తాన‌ని చెప్పి మంద‌స కేంద్రంగా (ఒడిశా స‌రిహ‌ద్దుల్లో ఉండే గ్రామాలు మంద‌స మండ‌లంలో ఉన్నాయి) నెల‌కొన్న వివాదాన్ని అప్ప‌టిక‌ప్పుడు ప‌రిష్క‌రించి హీరో అయ్యారు.

అదేవిధంగా లాక్డౌన్ వేళ‌ల‌లో వేర్వేరు ప్రాంతాలకు చెందిన కూలీలు ప‌లాస తదిత‌ర ప్రాంతాల‌కు చేరుకున్న‌ప్పుడు వారిని క్వారంటైన్ సెంట‌ర్ల‌కు పంపే విష‌య‌మై త‌లెత్తిన వివాదాన్నీ ప‌రిష్క‌రించారు. ఇదే కాదు ఇటీవ‌లే ఓ కిడ్నీ బాధిత కుటుంబాన్ని ఆదుకుని, ద‌త్త‌త తీసుకుని మాన‌వ‌త్వం చాటారు.ఇవ‌న్నీ బాగానే ఉన్నా ఆయ‌న కోపం ఆవేశం కార‌ణంగానే వివాదాల్లో ఉంటున్నారు.ముందుగా అదుపు త‌ప్పిన భాష కార‌ణంగా ఆయ‌న మ‌రో కొడాలి నాని (పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి) అవుతున్నారా అన్న ఆందోళ‌న అన్న‌ది ప్ర‌జ‌ల నుంచి వ‌స్తోంది.

– ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి – శ్రీ‌కాకుళం దారుల నుంచి…

– పొలిటిక‌ల్ పొలికేక – మ‌న లోకం ప్ర‌త్యేకం

Read more RELATED
Recommended to you

Exit mobile version