నూటికి నూరు కోసం తపన… జగన్ “చేదోడు”కు రెడీ!

తన పాలన ఏడాది పూర్తయ్యే సరికే నూటికి నూరు మార్కులు సంపాదించుకునే పనిలో పూర్తిగా నిమగ్నమైపోయారు జగన్! మనలో ఎంత పట్టుదల ఉందో పరీక్షించడానికే అప్పుడప్పుడూ ప్రకృతి సైతం పరీక్షలు పెడుతుందంటారు పెద్దలు! అంతా బాగున్నప్పుడు చేయడమే కాదు… కష్టకాలంలో సైతం పోరాడి గెలిచినప్పుడే అసలు సిసలు పట్టుదల రుజువవుతుందంటారు! ప్రస్తుతం జగన్ అలాంటి దశలోనే ఉన్నారు! చుట్టూ సమస్యలు.. ప్రకృతి పగబట్టిన సందర్భాలు.. అయినా సరే తనపని తాను చేసుకుంటూ అకుంఠదీక్షాపట్టుదలతో జగన్ ముందుకు దూసుకుపోతున్నారు! ఇందులో భాగంగా ఫీజు రీఎంబర్స్ మెంట్, రైతు మిత్ర, డ్వాక్రా రుణాలు, వాహన మిత్ర ప్రకటనల అనంతరం తాజాగా మరో ప్రకటన వెలువడనుంది!

ఒకవైపు రాష్ట్రాన్ని కరోనా వైరస్ మహమ్మారి అల్లకల్లోలం చేస్తుంటే.. సీఎం వైఎస్ జగన్ మాత్రం వరుసగా పేదవారి కోసం సంక్షేమ పధకాలను అమలు చేస్తూనే ఉన్నారు! ఈ క్రమంలో జూన్ 4 న సొంత ఆటో, ట్యాక్సీ ఉన్న డ్రైవర్లకు “వాహనమిత్ర” పథకం ద్వారా రూ.10 వేల చొప్పున ప్రోత్సాహకం అందజేయడానికి సిద్ధమైన ఏపీ ప్రభుత్వం… అదే నెల మొదటివారంలో “జగనన్న చేదోడు” పధకాన్ని ప్రారంభించనుంది. ఈ పధకం కింద రజకులు, నాయిబ్రాహ్మణులు, దర్జీలకు ప్రతీ ఏటా రూ. 10 వేలు సాయం ఇవ్వనుండగా.. ఈ డబ్బులు నేరుగా వారి ఖాతాల్లోకి జమ కానున్నాయి. ఈ కార్యక్రమానికి సంబందించి ఇప్పటికే లబ్దిదారుల ఎంపిక కూడా పూర్తయిపోయిందంట.

ఈ “జగనన్న చేదోడు” పథకానికి సుమారు 2,50,015 మంది అర్హత సాధించగా.. వారి జాబితాను ఈ నెల 25 తేదీ నాటికీ దశలవారీగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించనున్నారు. కరోనా కష్ట కాలంలో చేతుల్లో పనులు లేక నాయి బ్రాహ్మణులు, రజకులు, దర్జీలు ఎంత తీవ్రంగా నష్టపోయారనేది అందరికీ తెలిసిన విషయమే! వారిని ఆర్ధికంగా ఆదుకోవడానికి ఇదే మంచి సమయమని భావించిన జగన్… జూన్ మొదటివరాలంలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు!!