రాజకీయంగా, తెరాస అధినేత, తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మధ్య ఉన్న రాజకీయ వైరం గురించి అందరికి తెలిసిందే. వాళ్ళు అంతర్గతంగా ఎలా ఉంటారూ అనేది పక్కన పెడితే, రాజకీయంగా మాత్రం కత్తులు దూస్తారు. ఒకరిపై ఒకరు విమర్శల బాణాలు ఎక్కు పెడుతూ ఉంటారు. కెసిఆర్ చంద్రబాబుని చేసినన్ని విమర్శలు మరో నేతను చేయలేదేమో. తెలంగాణా ఎన్నికల్లో చంద్రబాబు లక్ష్యంగానే కెసిఆర్ ప్రచారం ఎక్కువగా చేసి విజయవంతం అయ్యారు. ఇప్పుడు ఆంధ్రాలో తెలుగుదేశం అధికారం లో లేదు.
ఈ సమయంలో ఆంధ్రా టీడీపీ అభిమానులు కేటిఆర్ ని పొగుడుతున్నారు. ఎందుకు ఏంటీ అనేది ఒకసారి చూద్దాం. తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబుని విమర్శించి ఉండవచ్చు గాని ఆయన ప్రవేశ పెట్టిన కొన్ని విప్లవాత్మక మార్పులను మాత్రం తెరాస రద్దు చేయలేదు. హైటెక్ సిటి మీద విమర్శలు చేసారు గాని హైటెక్స్ కమాన్ కి తెరాస రంగు వేయలేదు. అలాగే డ్వాక్రా సంఘాలను కూడా పెద్దగా కెసిఆర్ ఇబ్బంది పెట్టలేదు.
మీసేవ, ఈసేవ వంటి వాటిని రద్దు చెయ్యాలి అనే ఆలోచన చేయలేదు. చంద్రబాబు కట్టిన దేన్ని కూడా ఆపే ప్రయత్నం అనేది ఎక్కడా చేయలేదు. రాజకీయాలను రాజకీయాల వరకే కేటిఆర్ చూసారు, చంద్రబాబు ప్రవేశ పెట్టిన కార్యక్రమాలను పొగిడారు. కాని జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం చంద్రబాబు గుర్తులు లేకుండా చేసే ప్రయత్నం ఎక్కువగా చేసారు. దీనిపై తెలుగుదేశం ఆగ్రహంగా ఉంది. పక్క రాష్ట్రం వాళ్ళు చంద్రబాబుని గౌరవిస్తే, జగన్ కనీసం అది కూడా చేయడం లేదని, కేటిఆర్ ఉన్నతంగా ఆలోచించే వ్యక్తి అంటూ కొనియాడుతున్నారు.