ఏపీ ప్రజలకు సీఎం జగన్ తీపికబురు చెప్పారు. తాజాగా 1,49,875 పింఛన్లు కొత్తగా మంజూరు చేసినట్లు తెలిపారు. వీటితో మొత్తం పింఛన్ల సంఖ్య 64.27 లక్షలకు చేరినట్లు ఆయన వెల్లడించారు. 2022 డిసెంబరు నుంచి 2023 జులై వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హత కలిగి లబ్ధి అందని 2,62,169 మందిని గుర్తించి వారి ఖాతాల్లో రూ.216.34 కోట్లను గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు.
‘నవరత్నాలు-ద్వైవార్షిక మంజూరు’ పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో లబ్ధిదారులను ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ.. కొత్తగా మంజూరు చేసిన 2,00,312 కార్డులతో కలిపి మొత్తం బియ్యం కార్డుల సంఖ్య 1,48,12,934కి పెరిగిందని చెప్పారు. 4,327 ఆరోగ్యశ్రీ కార్డులు కూడా కొత్తగా ఇచ్చామని.. ప్రస్తుతం ఇచ్చిన 12,069తో కలిపితే మొత్తం ఇళ్ల పట్టాల సంఖ్య 30,84,935కి చేరిందని తెలిపారు. సాంకేతిక కారణాలతో గతంలో సున్నా వడ్డీ పంట రుణాలు, ఇన్‌పుట్ సబ్సిడీ అందని 1,08,000 మంది రైతులకు ఇప్పుడు అందిస్తున్నామని వెల్లడించారు.