టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఉపముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వారితో పాటే మరో 23 మంది మంత్రులూ ప్రమాణం చేస్తారు. మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు కొన్ని రోజులుగా విస్తృత కసరత్తు చేశారు. సామాజిక వర్గాలు, ప్రాంతాలు, వివిధ వర్గాల ఆకాంక్షల మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని సిద్ధం చేశారు. ఎట్టకేలకు మంగళవారం రాత్రి పవన్ సహా మొత్తం 24 మంది మంత్రుల జాబితాను ప్రకటించారు. ఒక స్థానాన్ని ఖాళీ ఉంచారు. జనసేనకు మూడు, బీజేపీకి ఒక స్థానం కేటాయించారు.
ఈ మంత్రి వర్గంలో 17 మంది కొత్తవారికి అవకాశం కల్పించారు. ముగ్గురు మహిళలకు చోటు లభించింది. బీసీలు ఎనిమిది మంది, ఎస్సీలు ఇద్దరు, ఎస్టీ ఒకరు, ముస్లిం మైనారిటీల నుంచి ఒకరికి, వైశ్యుల నుంచి ఒకరికి అవకాశం దక్కింది. నలుగురు కాపులు, నలుగురు కమ్మ, ముగ్గురు రెడ్లకు అవకాశమిచ్చారు. మరోవైపు తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన 10 మంది మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.