దసపల్లా హిల్స్ లో 40 అడుగుల రోడ్లను 100 అడుగుల రోడ్లు విస్తరిస్తామనే ప్రతిపాదనతో, రోడ్డు విస్తరణలో స్థలాలు కోల్పోతున్న వారికి వెయ్యికోట్ల రూపాయల టీడీఆర్ బాండ్లను జారీ చేయనున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ రఘురామ. దసపల్లా హిల్స్ లో బ్రిటిష్ కాలంలో నిర్మించిన సర్క్యూట్ హౌస్, రెండు పెద్ద వాటర్ ట్యాంకర్లు ప్రభుత్వ స్థలంలో నిర్మించినవేనని భావించారని, కానీ అవి దసపల్ల రాణి గారి ప్రైవేటు భూములుగా పేర్కొంటూ, వాటికి కూడా టీడీఆర్ బాండ్లను జారీ చేయనున్నారని తెలిపారు.
వైకాపా నెగ్గే వరకు దసపల్లా భూములు నిషేధిత భూముల జాబితాలో ఉండేవని, కోర్టు తీర్పు ఇచ్చిందని చెప్పి, ఏనాడు కోర్టు తీర్పును గౌరవించని వైకాపా ప్రభుత్వం… దసపల్లా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించిందని అన్నారు. 100 అడుగుల రోడ్డు విస్తరణ వల్ల హైరైస్ బిల్డింగుల నిర్మాణానికి అనుమతులు పొందే అవకాశం లభిస్తుందని, 40 అడుగుల రోడ్లు ఉంటే, కేవలం 5 అంతస్తుల వరకే అనుమతి లభిస్తుందని, అదే 100 అడుగుల రోడ్డు ఉంటే, 20 అంతస్తుల హై రైజ్ బిల్డింగులు నిర్మించుకునే వెసులుబాటు లభించనుందని తెలిపారు. ఎటువంటి పెట్టుబడి లేకుండానే నిర్మాణాలు చేపట్టవచ్చనేది పాలెగాళ్ల పథకమై ఉండవచ్చునని అన్నారు. విశాఖపట్నంలో ప్రభుత్వ ఆగడాలను ప్రశ్నిస్తున్న కార్పొరేటర్ మూర్తి యాదవ్ గారిని రఘురామకృష్ణ రాజు గారు అభినందించారు.