వైఎస్సార్ కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రామాలయం లో శ్రీరామ నవమి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఒంటిమిట్ట కోదండరామస్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 15 వరకు జరుగనున్నాయి.
శ్రీరామనవమి రోజున అన్ని ఆలయాల్లో సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. కానీ ఆ రోజు సీతారాముల కళ్యాణం లేని ఏకైక ఆలయం ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయమే. ఈ తరుణంలోనే ఈనెల 11న సీతారాముల వారి కళ్యాణోత్సవం జరుగుతుంది. శుక్రవారం జరుగబోయే ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణానికి 70వేల తిరుమల శ్రీవారి లడ్డూలు సిద్ధం చేస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. సీతారాముల కళ్యాణానికి వచ్చే భక్తులకు తిరుమల లడ్డూల పంపిణీకి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఎల్లుండి సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు కళ్యాణ వేదిక పై శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు.