తెలంగాణ లోని శ్రీవారి భక్తులకు టీటీడీ మరోసారి షాకిచ్చింది. కోట్లాది తెలుగు ప్రజల ఆరాధ్య దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దివ్య సన్నిధి తిరుమల లో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను ఆమోదిస్తామని ఇటీవల ఏపీ సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇచ్చిన మాటను మరుస్తూ.. టీటీడీ అధికారులు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖను కనీసం పరిగణలోకి తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల తెలంగాణ నుంచి కొందరు భక్తులు తిరుమల
లో దర్శనం, వసతి కోసం స్థానిక ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను వెంట తీసుకెళ్లారు.
ఆ లేఖలను టీటీడీ కార్యాలయంలో అందజేస్తే అధికారులు వాటిని ఆమోదించకపోవడంతో
వారు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఇదేంటని అక్కడున్న అధికారులను ప్రశ్నించగా.. తెలంగాణ
ప్రజాప్రతినిధుల సిఫార్సుల లేఖలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటన చేసినా.. బోర్డు సమావేశంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని, అధికారికంగా ఉత్తర్వులు రాలేదని బదులిచ్చారు. దీంతో ఎన్నో ఆశలతో తిరుమలకు చేరుకున్న భక్తులు తీవ్ర నిరాశకు గురై శ్రీవారి దర్శనం కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఈ విషయంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.