గత కొన్నిరోజులుగా తీవ్ర ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలంగాణ ప్రజలకు కాస్త ఉపశమనం లభించనుంది. రాష్ట్రంలో రానున్న ఐదు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్వా తావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. రానున్న ఐదురోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురియనున్నాయి. భూ ఉపరితలం వేడెక్కడంతోపాటు ద్రోణి ప్రభావం వలన ఈ వర్షాలు కురవనున్నాయని అధికారులు పేర్కొన్నారు.
బుధ, గురువారాల్లో ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన పడనుంది. రానున్న రెండు రోజులపాటు రాష్ట్రంలో 40 నుంచి 50 కిమీల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. కాగా వడగండ్ల వాన కురవనున్న ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.