అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్న ట్రంప్ యంత్రాంగం.. తాజాగా ఆరోగ్య విభాగంలో కోతలు మొదలుపెట్టింది. ఆరోగ్యం, మానవ సేవల విభాగం ఉద్యోగులకు తొలగింపు నోటీసులు పంపడం ప్రారంభించింది. HHS, ఇతర ప్రభుత్వ ఏజెన్సీల్లోని కార్మికులను తగ్గించాలని ట్రంప్ చర్యలు తీసుకున్న రోజుల వ్యవధిలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది.
అంటువ్యాధుల పర్యవేక్షణ, ఆహారం, ఆసుపత్రుల తనిఖీ, సగానికి పైగా దేశ జనాభా ఆరోగ్య బీమా కార్యక్రమాలను పర్యవేక్సించడంలో అమెరికా ఆరోగ్య విభాగం చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. ఈ డిపార్టుమెంట్ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా 10వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ఆరోగ్య శాఖ మంత్రి రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ ఇటీవల ప్రకటించారు. తద్వారా ఏడాదికి దాదాపు 1.8 బిలియన్ డాలర్లు ఆదా అవుతుందన్నారు. కార్మిక శక్తిని 82వేల నుంచి 62వేలకు తగ్గించుకోనున్నట్టు తెలుస్తోంది. వీరిలో ముందస్తు పదవీ విరమణ తీసుకునే వారు సహా బై అవుట్ ఆఫర్ పొందేవారు ఉన్నారు.