ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే.. మరోసారి తేల్చిచెప్పిన కేంద్రం

-

పార్లమెంటులో మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారం ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతేనని మరోసారి కేంద్ర సర్కార్ తేల్చి చెప్పింది. అమరావతి మాస్టర్‌ ప్లాన్‌కు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆమోదముద్ర వేసినట్లు స్పష్టం చేసింది. పట్టణ పరిపాలన, నగరాల దీర్ఘకాల అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్‌ అత్యవసరమని.. దేశంలోని 39% రాష్ట్రాల రాజధానులకు క్రియాశీలక మాస్టర్‌ప్లాన్‌ లేదన్నది వాస్తవమేనా అని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జావెద్‌ అలీఖాన్‌ సోమవారం రాజ్యసభలో ప్రశ్నించగా దానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రి కౌశల్‌ కిశోర్‌ బదులిచ్చారు.

ఈ క్రమంలో దేశంలోని రాష్ట్రాలన్నింటిని రాజధానులను ప్రస్తావించారు. అందులో ఏపీ రాజధానిగా అమరావతిని పేర్కొన్నారు. ప్రస్తుత సమాచారం మేరకు దేశంలోని 28 రాష్ట్రాలకుగానూ 26 రాష్ట్రాల రాజధానులకు ‘ఆమోదించిన మాస్టర్‌ప్లాన్‌’లు ఉన్నాయని కౌశల్ కిశోర్ తెలిపారు. ఇలా ఆమోదం పొందిన వాటిలో ఏపీ రాజధాని అమరావతి, తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ కూడా ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. కోహిమా (నాగాలాండ్‌), అగర్తలా (త్రిపుర) మాస్టర్‌ప్లాన్‌లకు మాత్రమే ఆమోదం లేదని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కౌశల్‌ కిశోర్‌  వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news