ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరుగుతోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశమున్నట్లు సమాచారం. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఈ నెలాఖరుతో గడువు ముగియనున్న ఈ నేపథ్యంలో బడ్జెట్ పొడిగింపునకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసే వీలుంది. దీంతో పాటు మరికొన్ని కీలక అంశాలపై సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
గత ప్రభుత్వ అక్రమాలపై విచారణలకు సంబంధించి, రాష్ట్రంలో నూతన ఇసుక విధాన రూపకల్పనపై కేబినెట్ చర్చించనుంది. మరో 15 రోజుల్లోగా కొత్త విధానం అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. భూకబ్జాల నిరోధానికి ల్యాండ్ గ్రాబింగ్ ప్రివెన్షన్ యాక్ట్ ను తీసుకువచ్చే అంశంపై కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపైనా రాష్ట్ర కేబినెట్లో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 22 నుంచి శాసన సభ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.