కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం హోదాతో పాటు కీలక శాఖలను సొంతం చేసుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ముఖ్యంగా తన శాఖల పరిధిలో కీలక సంస్కరణలపై దృష్టి పెడుతూనే మరోవైపు తన అసెంబ్లీలో అడుగుపెట్టేలా ఆశీర్వదించిన పిఠాపురం నియోజకవర్గం పై కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. ఇక పిఠాపురం అభివృద్ధిలో మరో ముందడుగు పడింది. రోడ్డు ఓవర్ బ్రిడ్జీ నిర్మాణానికి అనుమతులు వచ్చాయి. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
పిఠాపురం ప్రాంతంలో రోడ్డు ఓవర్ బ్రిడ్జీ నిర్మాణానికి రూ.59.70 కోట్లు మంజూరు చేసి, పాలనపరమైన అనుమతి లభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు పవన్ కళ్యాణ్. ఎన్నికల సమయంలో నేను ఈ వంతెన నిర్మాణానికి హామీ ఇచ్చాను. సామర్లకోట ఉప్పాడ రహదారిలో రైల్వే క్రాసింగ్ కారణంగా ప్రజలు రోజూ తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ వంతెన నిర్మాణం పూర్తయిన తరువాత రాకపోకలు సులభతరం అవుతాయి. ప్రజల ప్రయాణ సమయం ఆదా అవుతుందని తెలిపారు. ఈ రహదారి కేంద్ర రహదారి మౌళిక వసతుల నిధి సేతు బంధన్ పథకంలో భాగంగా చేపడుతున్నామన్నారు.