ఆంధ్రప్రదేశ్ శాసన సభ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. దాదాపు 15 రోజుల పాటు కొనసాగిన బడ్జెట్ సమావేశాల్లో పలు శాఖలకు కేటాయించిన నిధులు.. చేపట్టాల్సిన పనులపై సుదీర్ఘంగా చర్చించారు. ఇవాళ జరిగబోయే సభలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదిక పై అన్ని పార్టీల నాయకులు మాట్లాడి.. చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. ఇప్పటికే పలు బిల్లులను సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టి ఆమోదింపజేసింది. మరోవైపు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్రీడాపోటీలు నేటితో ముగియనున్నాయి.
పోటీలలో విజేతలకు సీఎం చంద్రబాబు బహుమతులను ప్రదానం చేయనున్నారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ నివేదికను కేబినెట్ అందజేసింది. ఆ నివేదికను మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తెలంగాణలో మాదిరిగానే ఎస్సీ వర్గీకరణను ఏకసభ్య కమిషన్ మూడు కేటగిరిలుగా రూపొందించింది. గ్రూపు 1, 2, 3 గా రెల్లి, మాదిగ, మాల ఉపకులాల వర్గీకరించారు. ప్రస్తుతం ఏపీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతుండగా.. ఇవాళ సభలో ఎస్సీ వర్గీకరణ నివేదికను ప్రవేవపెట్టనున్నారు.