భారీ వర్షాలు, వరదల కారణంగా విజయవాడ నగరం మొత్తం అతలాకుతలమైంది. విజయవాడలోని చాలా ప్రాంతాలు, కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకుపోయాయి. చంద్రబాబు ఆదివారం మధ్యాహ్నం నుంచి ఇప్పటివరకు అక్కడే ఉండి పరిశీలిస్తున్నారు. బాధితులు ధైర్యంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. వరద సహాయక కార్యక్రమాల పర్యవేక్షణలో భాగంగా హోమంత్రి అనిత విజయవాడ కలెక్టరేట్ లోనే ఉన్నారు. విజయవాడలోని హోమంత్రి నివాసాన్నికూడా వరద నీరు చుట్టుముట్టింది.
రామవరప్పాడు వంతెన దిగువన జలదిగ్భందంలో హోమంత్రి అనిత నివసించే కాలనీ ఉంది. ఆమె ఇంటిని వరద నీరు చుట్టుముట్టడంతో ఆమె తన పిల్లల్ని ఓ ట్రాక్టర్ ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. మరోవైపు విపత్తు నిర్వహణ శాఖ బృందం మంత్రి ఇంటి వద్దకు చేరుకున్నారు. తన ఇంటి వద్దకంటే ముంపు ప్రాంతాల్లో ముందు సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అనిత వారిని ఆదేశించారు. కాలనీలో ఇతర కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఆమె ఏర్పాట్లు చేశారు. తన ఇంటి వద్దకు వచ్చిన సహాయక బృందాన్ని సింగ్ నగర్ ప్రాంతానికి వెళ్లి వరద బాధితులకు సహాయసహకారాలు అందించాలని సూచించారు హోంమంత్రి అనిత.