చిత్తూరు జిల్లా పుంగనూరు, అమగల్లు కేసుల్లో టీడీపీ నేతలు 79 మందికి షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. చిత్తూరు, మదనపల్లి, కడప జైళ్లలో ఇప్పటి వరకూ ఈ టీడీపీ నేతలంతా ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డికి కూడా ఉపశమనం కలిగింది. మండలి సమావేశాలు జరుగుతుండటంతో ఆయనను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ప్రతి మంగళవారం సంబంధిత పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేసిన మరికొందరికి కూడా వూరట లభించింది. అంతకు ముందు హైకోర్ట్ ముందస్తు బెయిల్ ఇవ్వడంతో సీఐడీ సుప్రీంకోర్టు ను ఆశ్రయించిందని హైకోర్టు గుర్తు చేసింది. తదుపరి విచారణ వరకూ వీరిని అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ నేతల తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. 79 మందికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు కావడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.