మూడు రాజధానుల పేరిట ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు మూడు నామాలు పెడుతున్నారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర నాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. నంద్యాల జిల్లా నందికొట్కూరు లో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి పంగనామాలు కాదు రాయలసీమ అభివృద్ధి చెందాలన్నారు. వివేకానంద రెడ్డి కేసులో ఇరుక్కొని వాటి వాసన కడుక్కోలేకపోతున్నారని అన్నారు.
ఏపీ అభివృద్ధి కోసం పాటుపడకుండా మూడు ముక్కలాట రాజధానుల కోసం జగన్ తహతహలాడుతున్నాడని మండిపడ్డారు. అప్పర్ భద్ర ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలనే కేంద్ర నిర్ణయం తప్పు అన్నారు. మూడు రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోకుండా అప్పర్ భద్ర ప్రాజెక్టును నిర్మించాలనుకోవడం అన్యాయం అని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పర్ భద్ర ప్రాజెక్టు రాయలసీమకు మరణశాసనం అన్నారు బైరెడ్డి.
అప్పర్ భద్రా ప్రాజెక్టును వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. రాజకీయాలు ముఖ్యం కాదని, తనకి రాయలసీమ అభివృద్ధి ముఖ్యం అని స్పష్టం చేశారు. పార్టీలకతీతంగా అందరూ ఈ ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈనెల 28న సేవ్ రాయలసీమ పేరుతో చలో ఆదోని లో భారీగా పాల్గొనాలన్నారు. కర్నూలు నుంచి 25న మొదలుపెట్టే పాదయాత్రలో ప్రజలు భారీగా పాల్గొనాలని పిలుపునిచ్చారు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి.