ఏపీ ఎన్నికల్లో టీడీపీ – జనసేన – బీజేపీ కూటమిదే విజయం అన్న ధీమాతో పందేలు సాగుతున్నాయి. భీమవరం, కడప, నెల్లూరులాంటి ప్రాంతాల్లో కూటమి విజయంపై, ఎన్ని సీట్లు సాధిస్తుందనే అంశంలపైనే బెట్టింగ్ రాయుళ్లు పెద్ద ఎత్తున పందెం కాస్తున్నారు. ఒకవేళ కూటమి ఓడిపోతుందని ఎవరైనా పందెం వేసి నెగ్గితే.. వారికి (ఒకటికి నాలుగు) రూపాయికి రూ.4 చొప్పున ఇచ్చేందుకూ వెనుకాడటం లేదు.
గత ఎన్నికల్లో కంటే ఈసారి ఎక్కువ సీట్లు గెలవబోతున్నాం. చరిత్ర సృష్టించబోతున్నామంటూ సీఎం జగన్ ఇటీవల స్వయంగా ప్రకటించినా బెట్టింగ్ పై అదేం ప్రభావం చూపించడం లేదు. టీడీపీ ఒక్క పార్టీకే 89-92 సీట్లు వస్తాయని, కూటమికి 104-107 సీట్లు వస్తాయంటూ బెట్టింగ్ నడుస్తోంది. భీమవరం కేంద్రంగా రూ.150 కోట్ల విలువైన బెట్టింగ్‌లు నడుస్తోంది. కడపలో వైఎస్ షర్మిల విజయం, ఉండిలో రఘురామ మెజార్టీ, తణుకు టీడీపీ అభ్యర్థి విజయంపై పందేలు కాస్తున్నారు. మంగళగిరి విషయంలో ఆసక్తి ఎక్కువగా ఉంది. ఇక్కడ లోకేశ్ ఓడిపోతారని పందెం కాసి, గెలిస్తే వారికి ఒకటికి రూ.5 చొప్పున ఇస్తామని సవాలు విసురుతున్నారు.