అమరావతి నిర్మాణానికి కేంద్రం 12,500 కోట్లు కేటాయించినట్లు బీజేపీ ఎంపీ పురందేశ్వరి ప్రకటించారు. రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి మీడియాతో మాట్లాడుతూ… భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు లో తూర్పుగోదావరి జిల్లా రాష్ట్రంలో నాలుగో స్థానంలో ఉందని తెలిపారు. సెప్టెంబర్ రెండవ తేదీన మోడీ మొట్టమొదటిసారిగా సభ్యత్వం నమోదు చేసుకున్నారని… వర్షాలు, వరదల కారణంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆలస్యంగా ప్రారంభం అయిందని పేర్కొన్నారు.
కేంద్రం ప్రవేశపెడుతున్న పథకాలను సగర్వంగా ప్రజల ముందుకు తీసుకు వెళ్తున్నామని… గ్రామాల్లో ఉన్న మౌలిక సదుపాయాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని వెల్లడించారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నాలుగు వేల కోట్ల పైచిలుకు మౌలిక సదుపాయాలకు రుణం మంజూరు చేసిందని గుర్తు చేశారు. గడచిన ఐదేళ్లుగా గత ప్రభుత్వం పనితీరు కారణంగా ఆర్థికంగా రాష్ట్రం వెనుకబడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణానికి కేంద్రం 12,500 కోట్లు కేటాయించిందన్నారు.గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పోలవరం ప్రాజెక్టు నిలిచిపోయిందని ఫైర్ అయ్యారు.