తెలంగాణ ప్రభుత్వం మూసీ సుందరీకణ, పునరుజ్జీవం కోసం కీలక చర్యలు తీసుకుంటున్నదని అందుకు ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన నేపథ్యంలో కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి తాజాగా స్పందించారు. మూసీ సుందరీకరణకు, పునరుజ్జీవానికి తాము వ్యతిరేకం కాదని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. కానీ, మూసీకి ఇరువైపులా ముందు రిటైనింగ్ వాల్‌ను నిర్మించి..డ్రైనేజీ వాటర్ అందులో కలువకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
పేదల ఇళ్లను కూల్చకుండా కూడా మూసీ సుందరీకరణ చేయవచ్చని, ఆ తర్వాతే మూసీ పునరుజ్జీవం చేయాలని సూచించారు. కొన్ని ప్రాంతాల్లో మంచినీరు డ్రైనేజీల్లో కలుస్తూ వృథా అవుతున్నాయని, అటువంటి సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని కోరారు. నగరంలో డ్రైనేజీల సమస్యను ముందుగా పరిష్కరించకుండా, మూసీ సుందరీకరణ అసాధ్యం అన్నారు. మూసీ ప్రక్షాళనపై గురువారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సీఎం రేవంత్.. గరళకూపంగా ఉన్న మూసీని మంచినీరుగా మార్చడమే తన లక్ష్యమని వెల్లడించిన విషయం తెలిసిందే.