రాష్ట్రంలో మూడు రాజధానుల విషయంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మన తెలుగు వాడు.. రామ్ మాధవ్ .. తాజాగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక, ఇంకేముంది.. మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నవారికి కొంత ఆక్సిజన్ దొరికింది. ఇప్పటికే అనేక డిమాండ్లతో రాజధానులను వ్యతిరేకిస్తున్న గ్యాంగ్ అంతా కట్టకట్టుకుని జగన్ సర్కారుపై యుద్ధం చేసిన విషయం తెలిసిందే. ఉన్న అన్ని ఆయుధాలను ప్రయోగించాయి. అయితే, ఏ ఒక్కటీ జగన్ దూకుడు ముందు నిలవలేక పోవడంతో సదరు నేతలు, ప్రజలు ఇప్పుడు మౌనం పాటిస్తున్నారు.
కానీ, ఇప్పుడు బీజేపీ జాతీయ నేతగా ఏపీకి వచ్చి.. రాష్ట్ర బీజేపీ పగ్గాలు చేపట్టిన సోము వీర్రాజుకు బాధ్యతలు అప్పగించిన రామ్ మాధవ్.. రాజధాని విషయంపై మాట్లాడారు. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లోనే ఒకే ఒక్క రాజధాని లఖ్‌నవు ఉంది. మరి పట్టుమని 13 జిల్లాలు మాత్రమే ఉన్న ఏపీకి మూడు రాజధానులు అవసరమా? అని ప్రశ్నించారు. అంతేకాదు, దీనిని జగన్ పైత్యానికి ప్రతీకగా కూడా ఆయన అభివర్ణించారు. యూపీ భారీ ఎత్తున వెలిగిపోతోందని, ఒక్కరాజధానితోనే ఏ రాష్ట్రమైనా అభివృద్ధి సాధించి తీరుతుందని కూడా ఆయన లెక్కలు చెప్పుకొచ్చారు.
నిజమే.. రామ్ మాధవ్ ఎంతబాగా చెప్పారు అని ఓ వర్గం మీడియా ఆయనను హైలెట్ చేసేసింది. కానీ, కొంచెం లోతుల్లోకి వెళ్తే.. రామ్ మాధవ్ సార్ చెప్పింది నిజమో నేతి బీర మాటలో అర్ధమవుతుంది. యూపీలో ప్రస్తుతం 75 జిల్లాలు ఉన్నాయి. ఇంత భారీ సంఖ్యలో జిల్లాలు ఉన్న రాష్ట్రం ఇదొక్కటే. అయితే, అదే సమయంలో ఇక్కడ ప్రాంతీయ వాదం కూడా పెచ్చరిల్లింది. బుందేల్‌ఖండ్(మధ్యప్రదేశ్ సరిహద్దు ప్రాంతం)ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. అదేసమయంలో బిహార్ సరిహద్దుల్లో ఉండే ప్రాంతాలు తాము అభివృద్ధికి నోచుకోవడం లేదని కాబట్టి తమను కూడా ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలని డిమాండ్లు ఉన్నాయి.
అయితే ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఇక్కడ సైనిక బలగాలను ప్రయోగించి ఈ డిమాండ్లను అణిచి వేస్తున్నాయి. ఇక, ఆర్థికంగా చూసుకుంటే.. దేశంలో అత్యధిక అప్పులు ఉన్న రాష్రం యూపీనే. విద్యలోను, మిగిలిన రంగాల్లోనూ వెనుబాటులో ఉన్న రెండో రాష్ట్రం(బిహార్ తర్వాత) యూపీనే. మరి ఇన్ని కంతలు పెట్టుకుని ఆ రాష్ట్రంతో పోల్చిన సారు.. ఏపీని కూడా అలా చేయాలని భావిస్తున్నారా? అనే సందేహాలు వస్తున్నాయి. నిజానికి ఇలాంటి సమస్యలు రారాదనే ఇక్కడ మూడు రాజధానుల ప్రతిపాదన తెరమీదికి వచ్చిందనే వాస్తవాన్ని ఎందుకు విస్మరిస్తున్నారనేది ప్రధాన ప్రశ్న. మరి దీనికి కూడా రామ్ మాధవ్ సమాధానం చెప్పి ఉంటే ఆయన మాటలకు విశ్వసనీయత పెరిగి ఉండేది.