బాబులు ఇల్లు కదలరు… కరోనా టైంలో “చలో” అంటే ఎలా?

-

ప్రస్తుతం కరోనా కష్టకాలంలో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వం, ప్రజలది ఒక సమస్య అయితే… ప్రతిపక్షం టీడీపీది మరో సమస్యగా ఉంది! గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో చావుతప్పి కన్ను లొట్టబోయిన పరిస్థితుల్లో.. కరోనా వైరస్ ప్రతిపక్ష మనుగడను ప్రశ్నార్ధకం చేస్తోంది! రాష్ట్రంలో సమస్యలు లేకపోయినా.. ఏదో ఒక సమస్యను వెతుక్కుని.. అవసరమైతే సృష్టించి మరీ పోరాటాలు చేసే ప్రతిపక్ష పాత్రలు చాలానే చూసిన చంద్రబాబు… ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితుల్లో నిశ్చేష్టులై నిలిచిపోగా… ప్రస్తుతానికి ఉన్న ఒకటి రెండు స్పందనలూ ఆన్ లైన్ కే మరిమితం చేశారు! ఈ క్రమంలో ఉన్నపలంగా… బాబుకు ఒక అవకాశం వచ్చింది. అదే… “కావలిలో ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు” వ్యవహారం!

“మనిషి బ్రతికున్నంతకాలం పట్టించుకున్నది లేదు కానీ… చేతులారా పోగొట్టేసుకుని, ఇప్పుడు విగ్రహాలపై ఎక్కడలేని ప్రేమ చూపిస్తున్నారు” అని వినిపిస్తోన్న విమర్శల సంగతి కాసేపు పక్కనపెడితే… ప్రస్తుతం రాజకీయంగా పార్టీ మనుగడకు ఆ అంశం ఉపయోగపడుతుందనే కోణంలో అలోచిస్తోన్నారో ఏమో కానీ… ఈ విగ్రహం తొలగింపు విషయంలో సీరియస్ అయ్యారు చంద్రబాబు! “విజయవాడలో వైఎస్సార్ విగ్రహాన్ని కేవలం పుష్కరాల పేరు చెప్పి తొలగించినప్పుడు ఏమైపోయింది ఈ విగ్రహాలపైన ప్రేమ” అని వినిపిస్తోన్న మాటల సంగతి మరోసారి కాసేపు పక్కనపెడితే… ఈ విషయంలో శ్రేణులంతా కలిసి పోరాడాలని పిలుపునిస్తున్నారు చంద్రబాబు!

విజయవాడలో వైఎస్సార్ విగ్రహాన్ని కనీస ఇంటిమేషన్ కూడా ఇవ్వకుండా రాత్రికి రాత్రి తొలగించిన చంద్రబాబు… నేడు కావలిలో తొలగించిన ఎన్టీఆర్ విగ్రహాన్ని, తిరిగి మరోచోట పునర్నిర్మిస్తామని వైకాపా నేతలు చెబుతున్నా కూడా… కార్యకర్తలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇందులో భాగంగా.. కావలిలో ఎన్టీఆర్ విగ్రహం కావాలనే తొలగించారని.. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, పోలీసులు కలిసి తొలగించారని.. ఫైరవుతున్నారు చంద్రబాబు! అనంతరం… ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు అంశాన్ని సీరియస్‍ గా తీసుకోవాలని నెల్లూరు నాయకులకు సూచించారు. “చలో కావలి” కార్యక్రమాన్ని నిర్వహించాలని.. ఎన్టీఆర్ విగ్రహం టచ్ చేయాలంటే.. వైసీపీ నాయకులకు వణుకు పుట్టేలా మన “చర్యలు” ఉండాలని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు ఆదేశించారు.

అవసరమైన సమయాల్లో.. మరీ అత్యవసరమైన పరిస్థితుల్లో.. ఏదైనా మహానాయకుల విగ్రహాలు తొలగించాల్సి వస్తే… వాటిని మరోచోట ఇప్పుడున్నంతకంటే మరింత ఘనంగా పునఃప్రతిష్ట చేయడం ప్రభుత్వాల కనీస ధర్మం. ఈ విషయాన్ని గ్రహించిన వైకాపా పెద్దలు… తిరిగి ఆ విగ్రహాన్ని మరోచోట పెడతామని చెబుతున్నా కూడా… కరోనా కాలంలో “చలో” అనాలని పిలుపు ఇవ్వడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో 40 ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్న బాబుకే తెలియాలి!! నాడు విజయవాడలోని వైఎస్ విగ్రహాన్ని కూడా చంద్రబాబు పునఃప్రతిష్ట చేసి ఉంటే… నేడు మాట్లాడే నైతిక హక్కు ఉండేదని వినిపిస్తున్న మాటలు కొసమెరుపు!!

ఆ సంగతులు అలా ఉంటే… “చలో కావలి” కార్యక్రమాన్ని నిర్వహించాలని చంద్రబాబు చెప్పడంపై తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన – చినబాబు మాత్రం తమ తమ ఆరోగ్యాలు కాపాడుకుంటూ ఇల్లు కదలరు! కనీసం విశాఖ ఎల్జీ పాలిమర్స్ తో కలిపి మిగిలిన ఫ్యాక్టరీల ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలను కూడా పరామర్శించడానికి అడుగు బయటపెట్టరు. కానీ… కరోనా కాలంలో కార్యకర్తల ఆరోగ్యం గురించీ ఆలోచించకుండా “చలో” అంటే ఎలా చేయాలి అని ఫీలవుతున్నారంట. ఎవరి ఇంటి ముందు వారు నాలుగు అడుగులు నడిచి.. వీడియో తీసి.. ఆన్ లైన్ లో పోస్ట్ చేయమంటే పర్లేదు కానీ… ఇలా “చలో” అంటే కష్టమే అంటున్నారు!! చూడాలి మరి… ఈ “చలో కావలి” కార్యక్రమం ఎలా సక్సెస్ అవుతుందో!!

Read more RELATED
Recommended to you

Exit mobile version